Dec 09,2022 21:55

మృతి చెందిన ఈడిగ హరి(ఫైల్‌ ఫొటో)

       కనగానపల్లి : విద్యుత్‌ షాక్‌తో యువకుడు మృతి చెందిన సంఘటన శ్రీ సత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం ముత్తవకుంట్ల గ్రామంలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాల మేరకు... ముత్తవకుంట్ల గ్రామానికి చెందిన ఈడిగ హరి(26) కియా కంపెనీలో రోజువారి కార్మికునిగా పని చేస్తున్నాడు. శుక్రవారం ఉదయం యువకుడు స్నానం చేసేందుకు బాత్‌రూం వద్దకు వెళ్లాడు. బాత్‌రూం తలుపు ముట్టకోగానే షాక్‌గురై అక్కడికక్కడే మృతి చెందాడు. షాక్‌కు గురైన సమయంలో గట్టిగా కేకవేయడంతో కుటుంబ సభ్యులు బయటకు వచ్చి చూశారు. అప్పటికే యువకుడు మృతి చెందినట్లు గుర్తించారు. దీంతో తల్లిదండ్రులు కన్నీటి పర్యవంతం అయ్యారు. విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా ముత్తువకుంట్ల గ్రామంలో విద్యుత్‌ సరఫరా సక్రమంగా లేదని, టీవీలు, ఫ్రిడ్జ్‌లు కాలిపోతున్నాయని విద్యుత్‌ అధికారులకు తెలిపినా పట్టించుకోలేదన్నారు. యువకుని మృతికి విద్యుత్‌ అధికారులే కారణం అని పేర్కొన్నారు.