ఎపిఎస్‌పిడిసిఎల్ అధికారుల సమీక్షలో సిఎండి కె.సంతోషరావు
పీలేరు : వినియోగదారులకు విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయానికి అవకాశం ఇవ్వకుండా చూడాల్సిన బాధ్యత మనపై ఉందని ఎపిఎస్‌పిడిసిఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కె.సంతోషరావు తెలిపారు. మంగళవారం స్థానిక ఎంఎన్‌ఆర్ గార్డెన్స్‌లో ఎపిఎస్‌పిడిసిఎల్ పీలేరు డివిజన్ స్థాయి అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ రైతులకు పగటిపూట నిరంతరాయంగా తొమ్మిది గంటల పాటు విద్యుత్ సరఫరా అందించాలని ఆదేశించారు. అగ్రికల్చర్ సర్వీసు కోసం దరఖాస్తు చేసుకున్న 20 రోజుల్లోగా మంజూరు చేయాలని పేర్కొన్నారు. విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ మరమ్మతులను వెంటనే చేపట్టాలని తెలిపారు. కాలిపోయిన ట్రాన్స్ ఫార్మర్లను వెంటనే మార్పు చెయ్యాలని సూచించారు. విద్యుత్తు కోతలు లేవని, కొత్త ట్రాన్స్ ఫార్మర్ల ఏర్పాటు చేయాలని చెప్పారు. లోవోల్టేజీ సమస్య లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. సబ్ స్టేషన్ మరమ్మతుల విషయంలో, 11 కెవి లైన్ల మార్గంలోని చెట్ల కొమ్మల తొలగింపు సమయాల్లో మాత్రమే విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండాలని మిగిలిన సమయాల్లో ఆ సమస్య తలెత్తకుండా చూడాలని సిఎండి అధికారులను ఆదేశించారు. సమావేశంలో సిజియం గురవయ్య, ఒఎస్‌డి శ్రీనివాసులు, ఎస్‌ఇ ఎం.కృష్ణారెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ మునిచంద్ర, డిఇఇలు, ఎఒలు, సిబ్బంది పాల్గన్నారు.










