Sep 24,2023 21:55

ఫొటో : మాట్లాడుతున్న వామపక్షాల నాయకులు

విద్యుత్‌ సంస్కరణలతో ప్రజలపై దోపిడీ
ప్రజాశక్తి-కావలి రూరల్‌  :  విద్యుత్‌ సంస్కరణల పేరుతో ప్రజలపై దోపిడీ జరుగుతుందని వామపక్షాల నాయకులు పేర్కొన్నారు. పెరిగిన విద్యుత్‌ ఛార్జీలపై ఆదివారం సిపిఎం కార్యాలయంలో వామపక్షాల నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిపిఎం నాయకులు పసుపులేటి పెంచలయ్య, సిపిఐ నాయకులు కే నాగరాజు, సిపిఐ (ఎంఎల్‌) నాయకులు కే లక్ష్మిరెడ్డి, సిపిఐ (ఎంఎల్‌ న్యూ డెమోక్రసీ) నాయకులు కరవధి భాస్కర్‌ పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలను అమలు చేస్తూ ప్రజలపై భారాల మోపుతుందని విమర్శించారు.
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ విధానాలలో భాగంగానే కరెంటు ఛార్జీలను రాష్ట్ర ప్రభుత్వం పెంచుతుందని తెలిపారు. రాష్ట్రంలో వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు పెద్దగా ఒరిగిందేమీ లేదని, సంక్షేమ పథకాల పేరుతో పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు లాగేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రకరకాల పేర్లతో ప్రజల నుండి దోపిడీ చేస్తున్నారని, తీవ్రంగా ప్రభుత్వ విధానాలను ఖండిస్తున్నామన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కరెంటు ఛార్జీలు అనేకసార్లు పెంచి ప్రజలపై భారం మోపిందని, మళ్లీ ట్రూ అప్‌ ఛార్జీలు, ఇతర ఛార్జీల పేరుతో రూ.100 వస్తున్న కరెంటు బిల్లు ఇప్పుడు సుమారు రూ.300 అయిందని, రూ.300 బిల్లు రూ.600కు చేరిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను మానుకోవాలని పెంచిన కరెంటు ఛార్జీలు తగ్గించాలని ప్రజలపై భారాలు మోపవద్దని హితవు పలికారు. స్మార్ట్‌ మీటర్లు పెట్టే విధానం ఉపసంహరించుకోవాలని, గతంలో టిడిపి ప్రపంచ బ్యాంకు విధానాలలో భాగంగా విద్యుత్‌ ఛార్జీలను పెంచడంతో ప్రజలు తీవ్రమైన పోరాటాలు చేసి ఆ పార్టీని ఇంటికి పంపడం జరిగిందన్నారు. విద్యుత్‌ ఛార్జీల పెంపుపై వ్యతిరేకిస్తూ 27వ తేదీన వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌ వారి కార్యాలయం వద్ద జరిగే ధర్నాలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో స్త్రీ విముక్తి సంఘటన నాయకురాలు కె.శ్యామలమ్మ, సిఐటియు నాయకులు పి.తిరుపాలు, ఎఐటియుసి నాయకులు మల్లి అంకయ్య, తదితరులు పాల్గొన్నారు.