May 23,2022 23:20

కలెక్టర్‌కు వినతిపత్రం అందజేస్తున్న రైతు సంఘాల నాయకులు

       విజయవాడ : రైతాంగానికి నష్టం చేకూర్చేలా కేంద్ర ప్రభుత్వ తీసుకొచ్చిన నూతన విద్యుత్‌ సంస్కరణలను రద్దు చేయాలని ఎపి రైతు సంఘాల సమన్వయ కమిటీ ప్రతినిధులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం రైతు సంఘాల ప్రతినిధి బృందం ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఎస్‌.ఢిల్లీరావుకు స్పందనలో వినతిపత్రం అందజేశారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ విద్యుత్‌ మోటార్లకు మీటర్లు బిగించే పనిలో ఉందని, రాష్ట్రంలో సుమారు 18 లక్షల వ్యవసాయ మోటార్లు ఉన్నాయని, వాటికి స్మార్ట్‌ మీటర్లు బిగిస్తే రైతులు నష్టపోతారని ఎపి రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెవివి ప్రసాద్‌, అధ్యక్షులు వై.కేశవరావు, రాష్ట్ర సాగునీటి సంఘాల సమాఖ్య అధ్యక్షులు ఆళ్ల గోపాలకష్ణారావు తెలిపారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ఎన్‌టి రామారావు, వైఎస్‌ ప్రభుత్వ హయాంలో వ్యవసాయ రంగంలో రైతులకు మేలు చేయడానికి ఉచిత విద్యుత్‌ అమలు చేశారన్నారు. నేటి బిజెపి ప్రభుత్వం రైతులపై భారాలు వేసేందుకు సిద్ధమైందన్నారు. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో విద్యుత్‌ మీటర్లు అమర్చారని, దీనిని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, దీనిని రైతులంతా కలిసికట్టుగా తిప్పికొట్టాలని అన్నారు. కరపత్రాలు పంపిణీ ద్వారా రైతుల్లో విస్తత ప్రచారం నిర్వహించాలన్నారు. దేశంలో పారిశ్రామిక రంగంతో ముడిపడి ఉన్న వ్యవసాయ రంగానికి విద్యుత్‌ సబ్సిడీ ఇవ్వాల్సి ఉందన్నారు. నూతన విద్యుత్‌ సంస్కరణలను బిజెపి పాలిత రాష్ట్రాల్లోనే వ్యతిరేకిస్తున్నారని, ఎపిలో అమలుకు పూనుకోవడం దారుణమని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం కష్ణాజిల్లా నాయకులు మోతుకూరి అరుణకుమార్‌, బుడ్డి రమేష్‌, మరీదు ప్రసాదు తదితరులు పాల్గొన్నారు.