విద్యుత్ శాఖలో విజిలెన్స్ తనిఖీలు
ప్రజాశక్తి-ఇందుకూరుపేట : మండలంలోని కొత్తూరు విద్యుత్ శాఖ అధికారులపై కలెక్టర్ ఫిర్యాదు అందడంతో గురువారం విజిలెన్స్ అధికారులు ఎస్‌పిఎస్‌ఆర్ నెల్లూరు జిల్లా ఎపి టిఎస్ అండ్ విజిలెన్స్ పోలీస్ స్టేషన్ సిఐ బి.శ్రీనివాసరెడ్డి, ఎస్‌ఐ కె.సాంబశివరావు కొత్తూరు ప్రాంతంలో విచారణ చేపట్టారు. సోమవారం 13వ తేదీన కొంతమంది రైతులు నుంచి కలెక్టర్‌కు ఫిర్యాదులు అందడంతో విద్యుత్ శాఖలోని కుంభకోణం వెలుగులోకి వచ్చింది. విద్యుత్ శాఖలో కొత్తూరు ఏఈగా విధులు నిర్వహిస్తున్న వెంకటేశ్వరరాజుపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. భారీ ముడుపులు తీసుకుని రొయ్యల గుంతలకు నిబంధనలకు విరుద్ధంగా 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలతోపాటు, కొత్తూరులోని ఓ ప్రయివేటు లేఅవుట్‌కు రైతులకు మంజూరైన ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అదేవిధంగా జగదేవిపేట కో-ఆపరేటివ్ బ్యాంక్ పక్కనే ఉన్న అతిథి గృహానికి ఏర్పాటు చేసిన విద్యుత్ సౌకర్యమే ఈ అవినీతికి పరాకాష్టగా నిలిచింది. అదేమ్మసత్రం, లేబూరు లింకు రోడ్డు, పున్నూరు, మూలపాడులకు ఎలాంటి అనుమతులు లేకుండా సర్వీసు లైన్లు తదితర పనులు చేసినట్లు తెలుస్తోంది. సదరు అధికారి వ్యవహారంపై ఇటీవల కలెక్టర్‌కు కొంతమంది రైతులు ఫిర్యాదు చేయడంతో ఈ విషయాలు బట్టబయలయ్యాయి.
విజిలెన్స్ సిఐ బి.శ్రీనివాసరెడ్డి వివరణ కోరగా.. కొత్తూరు సబ్‌స్టేషన్ పరిధిలో అవినీతి జరిగిన ప్రదేశం సందర్శించి కేసుపై విచారణ చేపట్టామని తెలిపారు. విచారణ తర్వాత అవినీతి నిర్థారణ అయితే చర్యలు తీసుకుంటామన్నారు.










