Dec 25,2021 07:25

    కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో వినాశకర విద్యుత్‌ సంస్కరణలకు రాష్ట్రం ప్రయోగశాలగా మారిపోయింది. వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగింపు మొదులకొని శ్లాబుల మార్పులు, స్మార్ట్‌ ట్రాన్స్‌మిషన్‌ కేంద్రాలు, స్మార్ట్‌ మీటర్లు, ఇప్పుడు 'ఒకే మీటరు' షరతుతో ప్రజలపై భారాలు మోపే చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం తెగిస్తోంది. ప్రపంచ బ్యాంకు ఆంక్షలకు తలొగ్గి గతంలో చంద్రబాబు నాయుడి నేతృత్వంలోని టిడిపి ప్రభుత్వం ఇదే తరహా తప్పుడు చర్యలకు తెగబడినప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో మహోద్యమం సాగింది. ఆ విద్యుత్‌ మహోద్యమ ఫలితంగానే టిడిపి ప్రభుత్వం గద్దె దిగాల్సి వచ్చింది. ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం విద్యుత్‌ రంగాన చంద్రబాబు ప్రభుత్వ తరహాలో వినాశకర చర్యలకు పాల్పడటం విస్మయకరం. పైగా ప్రత్యేక హోదా, రైల్వే జోన్‌, పోలవరం నిర్మాణం విషయంలో పదేపదే ద్రోహం చేస్తున్న కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని నిలదీయకుండా..అది చెప్పిన వినాశకర విధానాలన్నిటికీ జీ హుజూర్‌ అనడం ఘోరం. రాష్ట్రాన్ని గత ప్రభుత్వం అప్పుల ఊబిలోకి నెట్టిందంటూ ఖజానా నింపుకోవడానికి కూడా ఈ వినాశకర విధానాలనే ఉపయోగించుకోవాలనుకోవడం ఇంకో దుర్మార్గం.
    నవరత్నాలు పేరిట రాష్ట్ర ప్రభుత్వం అమల్జేస్తున్న సంక్షేమ పథకాలు పేద ప్రజలకు లబ్ధి చేకూర్చేవే. కానీ ఆ పథకాల అమలుకోసం మళ్లీ పేదలపైనే భారాలు వేయడం తగదు. వినియోగదారుల జేబుల గుల్ల జేసి ఖజానా నింపుకొనే తహతహతోనే విద్యుత్‌ సంస్కరణలు ఇంత జోరుగా అమల్జేస్తున్నారా అనే సందేహం కలగకమానదు. 'స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌' పథకం కోసం ఒక ఇంట్లో ఎన్ని కుటుంబాలుంటే అన్ని కుటుంబాలకు విడివిడిగా చెత్త పన్నులేస్తున్న ప్రభుత్వం..ఇప్పుడు విద్యుత్‌ మీటర్ల విషయానికి వచ్చే సరికి ఎన్ని పోర్షన్లున్నా ఇంటి మొత్తానికి ఒకే మీటరు ఉండాలని షరతు పెట్టడం ఎంత మాత్రం సమంజసం కాదు. కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 'ఒకే మీటరు' షరతుతో నోటీసులు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ కమిషన్‌ (ఎ.పి.ఇ.ఆర్‌.సి) నిబంధనల ప్రకారం ఇంట్లో ఎన్ని వంటగదులుంటే అన్ని విద్యుత్‌ మీటర్లు తీసుకునే వెసులుబాటు ఉంది. అంటే వంట గది నిర్మాణం అని కాదు. విడిగా వండుకోవడం. ఆంధ్రప్రదేశ్‌ దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ జారీ చేసిన నోటీసులో ఒక ఇంటికి ఒక మీటరు మాత్రమే ఉండాలని, అది నిబంధన అని పేర్కొన్నారు. ఇది ఇఆర్‌సి నియమావళిని ఉల్లంఘించడమే. ఏడు రోజుల్లో స్వచ్ఛందంగా రద్దు చేసుకోకపోతే మొత్తం మీటర్లను తొలగిస్తామని హెచ్చరించడం వినియోగదారుల హక్కులను కాలరాయడమే.
    రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1.63 లక్షల గృహ విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి. ఒకటి మించి విద్యుత్‌ మీటర్లు ఉన్న కనెక్షన్లు కర్నూలు జిల్లాలో 1117 ఉన్నట్లుగా ఇప్పటికే గుర్తించారు. మిగిలిన జిల్లాల్లోనూ సర్వే ద్వారా గుర్తింపు, నోటీసుల ప్రక్రియకు కసరత్తు జరుగుతోంది. ఇంటి సముదాయాల్లో ఐదు పోర్షన్ల కంటే ఎక్కువ ఉంటేనే బోరుకు ప్రత్యేక మీటరు ఇవ్వాలని కూడా విద్యుత్‌ శాఖ నిర్ణయించింది. పట్టణ ప్రాంతాల్లో అలాంటి ఇళ్లకు నోటీసులిచ్చే ప్రక్రియనూ ప్రారంభిస్తున్నారు. గతంలో ఒక గృహ సముదాయంలో రెండు కంటే ఎక్కువ పోర్షన్లు ఉంటే బోరుకు ప్రత్యేక మీటరు బిగించుకునేందుకు అవకాశముండేది. ఇక ఆ అవకాశం ఉండదు. బోరు, ఇంటికి కలిపి ఒకటే మీటరు ఉంటే విద్యుత్‌ టారిఫ్‌ మారి బిల్లు భారీగా పెరిగిపోతుంది. ప్రజలపై ఎనలేని భారాలు పడటం ఖాయం. సంక్షేమ పథకాలకు 300 యూనిట్ల నిబంధన ఎలాగూ ఉంది కాబట్టి 'ఒకే మీటరు'తో యూనిట్లు పెరిగిన కుటుంబాలన్నీ సంక్షేమ పథకాలకు దూరమౌతాయి. అంటే ఇటు ఛార్జీల దరువు..అటు సంక్షేమ పథకాల కోత. ఒకే దెబ్బకు రెండు పిట్టలు. ఇలాంటి చర్యలతో పేద ప్రజలకు 'మేళ్లు' చేయాలనే ప్రభుత్వ లక్ష్యం ఒట్టి మాటగానే మిగిలిపోతోంది. విద్యుత్‌ వినాశకర సంస్కరణల ఫలితాల రుచిచూసిన గత పాలకుల బాటలో పయనిస్తే నిప్పుతో చెలగాటమాడటమే అవుతుంది. ప్రభుత్వం ఇలాగే మొండిగా భారాలతో ముందుకెళ్తామని భీష్మించుకుంటే కేంద్రంలో వ్యవసాయ చట్టాలను తిప్పికొట్టినట్టే ఇక్కడా వినాశకర విధానాలను, భారాల మోతను తిప్పికొట్టడం ఖాయం.