May 16,2023 21:54

ఫొటో : డిఇఇతో మాట్లాడుతున్న సిపిఎం నాయకులు

విద్యుత్‌ కోతలను అరికట్టాలి : సిపిఎం
ప్రజాశక్తి-కావలి : కావలి పట్టణంలో కొన్ని రోజుల నుండి ఉన్న కరెంటు కోతలు ఆపాలని మంగళవారం ఎపిఎస్‌పిడిసిఎల్‌ డి.ఇ.ఇ. ఆఫీస్‌ వద్ద సిపిఎం నాయకులు ధర్నా చేశారు. అనంతరం డి.ఇ.ఇ. విజరు కుమార్‌ రెడ్డికి అర్జీని అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కార్యదర్శి పసుపులేటి పెంచలయ్య మాట్లాడుతూ పట్టణంలో కొన్ని రోజుల నుండి కరెంట్‌ అంతరాయం ఏర్పడుతుందన్నారు. రాత్రి, పగలు అని తేడా లేకుండా కరెంట్‌ అంతరాయం ఏర్పడుతుందన్నారు. దీని వల్ల ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారన్నారు. రాత్రి వేళల్లో రెండు మూడు సార్లు కరెంటు పోతున్నందు వల్ల నిద్ర సమయంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.
ముఖ్యంగా చిన్న పిల్లలు చాలా ఇబ్బందులకు గురవుతున్నందు వల్ల తల్లిదండ్రులు ఆందోళనలకు గురవుతున్నారని తెలిపారు. అంతే కాకుండా కరెంటు అంతరాయంతో పట్టణ ప్రజలకు తాగునీటి సమస్య కూడా ఏర్పడుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కరెంటు బిల్లులు పెంచడమేకాక, ట్రూఅప్‌ ఛార్జీలు, ఇతర యూజర్‌ ఛార్జీల పేరుతో ప్రజల దగ్గర డబ్బులు అధికంగా వసూలు చేసుందన్నారు. పూర్తిగా కరెంటు ప్రజలకు అందించటంలో అధికారులు, రాష్ట్రప్రభుత్వం విఫలమవుతున్నట్లు తెలిపారు. ప్రజల సమస్యలు పరిష్కరిస్తామని మంచిపాలన అందిస్తామని, చెప్పి అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభుత్వం ప్రజలపై భారాలు మోపడం తప్ప సమస్యలను పరిష్కరించడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా విద్యుత్‌ అధికారులు స్పందించి కరెంటు అంతరాయం కలగకుండా సరఫరా చేయాలని సిపిఎం తరఫున డిమాండు చేస్తున్నామన్నారు. అలా జరగని పక్షంలో ప్రజలను సమీక్షించి, ఆందోళన చేపడ తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు వై.క్రిష్ణమోహన్‌, జి.మధుసూదన రావు, సిపిఎం నాయకులు పి.సాయి, వి.బాబురావు, పి.అన్వర్‌, డి.వై.ఎఫ్‌.ఐ. నాయకులు పి.కోటేశ్వరరావు, కె.చెన్నయ్య, కె.ప్రభాకర్‌, కార్యకర్తలు పాల్గొన్నారు.