ప్రజాశక్తి - నందిగామ (ఎన్‌టిఆర్) : విద్యుత్ రంగంలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్ చేసి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌సిహెచ్ శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం నందిగామ సుందరయ్య భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎన్‌సిహెచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. విద్యుత్ సంస్కరణలలో భాగంగా కాంట్రాక్టు కార్మికులు, షిప్ట్ ఆపరేటర్లు, సబ్ ఇంజనీర్లు, వాచ్ మెన్లు పనిచేస్తున్నారని, వీరిని ప్రభుత్వం రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. 2016లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం కార్మికులకు సమాన పనికి సమాన వేతనం అమలు కావటం లేదని, ఇంక్రిమెంట్లు ఇవ్వటం లేదన్నారు. పెయిడ్ హాలిడేస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికులకు మెమో 1214 ద్వారా సంక్షేమ పథకాలు నిలిపివేశారని , తక్షణమే క్లైయిమ్‌లు చెల్లించాలని డిమాండ్ చేశారు. పెరిగిన భవన నిర్మాణ మెటిరియల్ ధరలు తగ్గించి కార్మికులకు పని కల్పించాలన్నారు. స్కీమ్ వర్కర్స్, అంగన్వాడీ కార్మికులకు గ్రాట్యూటీ, పిఎఫ్, ఇఎస్‌ఐ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నందిగామ మండల కార్యదర్శి కటారపు గోపాల్ తదితరులు పాల్గొన్నారు.










