విద్యుత్ ఛార్జీలు భారం మోపితే ఉద్యమం
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్ : పేద ప్రజలపై అధిక విద్యుత్ ఛార్జీలను మోపితే ఉద్యమాలను చేపడతామని జిల్లా కౌలు రైతు సంఘం, ఎపి రైతు సంఘం నాయకులు హెచ్చరించారు. విద్యుత్ ఛార్జీల ప్రతిపాదనలపై ఎపి విద్యుత్ నియంత్రణ మండలి ఎపిఇఆర్‌సి వారు విశాఖపట్నం నుంచి వర్చువల్ పద్ధతిలో బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం 3 రోజుల పాటు నిర్వహించారు. శుక్రవారం ఆత్మకూరు పట్టణంలోని ఆత్మకూరు విద్యుత్ డివిజనల్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఎపి ఇఆర్‌సి) వారు 2023-24 విద్యుత్ టారిఫ్ విషయంలో ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణకు జిల్లా కౌలు రైతు సంఘం ఎపి రైతు సంఘం నాయకులు గంటా లక్ష్మీపతి, లక్కు కష్ణప్రసాద్ పాల్గొని అభ్యంతరాలను వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యవసాయ మోటార్ల విషయం ఎస్‌సి ఎస్‌టి వినియోగదారులకు ఇచ్చే సబ్సిడీ విషయం గజెట్ నోటిఫికేషన్‌లో కనబరచ లేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. గృహ వినియోగదారులకు మాత్రమే యూనిట్‌కు రూ.2.60 పైసల నుంచి రూ.3 వరకు పేద, మధ్య తరగతి ప్రజల మీద భారం పడే విధంగా నోటిఫికేషన్ జారీ చేశారన్నారు. లోటు బడ్జెట్ రూ.12,498 కోట్లు ఎలా సర్దుబాటు చేస్తారో కనబరచలేదని ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రజలపై భారాలు మోపవద్దని లేని పక్షంలో విద్యుత్ ఉద్యమాలు తప్పవన్నారు. అనంతరం విద్యుత్ డిఇకి వినతిపత్రం అందజేశారు.










