Apr 26,2023 21:10

విద్యతోనే సమాజాభివృద్ధి : కలెక్టర్‌

 రాయచోటి : ఉన్నత విద్యతోనే సమాజాభివృద్ధి, కుటుంబ ఆర్థిక ప్రగతి సాధ్యమవుతుందని కలెక్టర్‌ గిరీష పేర్కొన్నారు. జగనన్న వసతి దీవెన పథకం కింద అన్నమయ్య జిల్లాలో 34,836 మంది విద్యార్థులకు చెందిన 31,846 మంది తల్లులు బ్యాంకు ఖాతాలకు రూ.33.72 కోట్లు ముఖ్యమంత్రి జమ చేసినటు తెలిపారు.బుధవారం అనంతపురం జిల్లా, నార్పల బహిరంగ వేదిక నుంచి జగనన్న వసతి దీవెన పథకం కింద రూ.912.71 కోట్ల ఆర్థిక సాయాన్ని కంప్యూటర్‌ బటన్‌ నొక్కి నేరుగా అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జగన్‌ జమ చేశారు. కార్యక్రమానికి అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి కలెక్టరేట్లోని మినీ వీడియో కాన్ఫరెన్స్‌ హాల్లో డిఆర్‌ఒ సత్యనారాయణ, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి జాకీర్‌ హుస్సన్‌, జిల్లా బిసి వెల్ఫేర్‌ ఆఫీసర్‌ సందప్పతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జగనన్న వసతి దీవెన పథకం కింద ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థుల భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ఏటా రెండు వాయిదాల్లో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్‌, మెడిసిన్‌ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తోందన్నారు. విద్యారంగంలో రాష్ట్ర ముఖ్యమంత్రి విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారన్నారు. జిల్లాలో జగనన్న వసతి దీవెన పథకం కింద ఎస్‌సి సంక్షేమం 4,540 మంది విద్యార్థులకు రూ.4.32 కోట్లు, ఎస్‌ టి సంక్షేమం 1072 విద్యార్థులకు రూ.1.02 కోట్లు, బిసి సంక్షేమం 13,655 విద్యార్థులకు రూ.13.17 కోట్లు, ఈబిసి కింద 4,896 విద్యార్థులకు రూ.4.81 కోట్లు, ముస్లిం మైనారిటీ కింద 5,215 మంది విద్యార్థులకు రూ.5.06 కోట్లు, కాపు సంక్షేమం కింద 5,396 మంది విద్యార్థులకు రూ.5.24 కోట్లు, క్రిస్టియన్‌ మైనారిటీ కింద 612 మంది విద్యార్థులకు రూ.6.07 లక్షలు జమ చేశారన్నారు. జగనన్న వసతి దీవెన పథకాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. అంతకుముందు జగనన్న వసతి దీవెన పధకం సంబంధించి మెగా చెక్కును విద్యార్థులు, విద్యార్థులు తల్లులకు కలెక్టర్‌ అందజేశారు.
- వసతి దీవెన చెక్‌ను అందజేస్తున్న కలెక్టర్‌ గిరీష