Dec 30,2022 19:28

విద్యార్థికి ట్యాబ్‌ను అందజేస్తున్న ఎమ్మెల్యే చింతల

ప్రజాశక్తి-వాల్మీకిపురం: పిల్లలకు మనమిచ్చే నిజమైన ఆస్తి విద్యే అని, విద్యతోనే పేదరికాన్ని పారదోలగలమని ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని చింతపర్తి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో కొత్త మంచూరు, గండబోయనపల్లి, చింతపర్తి, వాల్మీకిపురం పట్టణంలోని అంబేడ్కర్‌ గురుకుల పాఠశాల, ఏపీఆర్‌ మైనార్టీ గురుకుల పాఠశాల, జడ్పీ ఉర్దూ ఉన్నత పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న 325 మంది విద్యార్థులకు ఎమ్మెల్యే చేతులమీదుగా ట్యాబ్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ప్రపంచంలో పోటీపడాలని, అందుకు అవసరమైన వనరులన్నీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి కల్పిస్తున్నారన్నారు. ఈ పోటీ ప్రపంచంలో మన విద్యార్థులకు మంచి మంచి ఉద్యోగాలు లభించాలంటే తప్పనిసరిగా ఇంగ్లీష్‌ విద్య అవసరమని అభిప్రాయ పడ్డారు. ప్రభుత్వం ఇంగ్లీష్‌ విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. విద్యావ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకు వచ్చి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడానికి వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం వెచ్చిస్తోందన్నారు. నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌ పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దుతున్నారన్నారు. ఆర్థిక సమస్యలతో పేద పిల్లలు చదువులకు దూరం కాకూడదనే సంకల్పంతో దేశంలో ఎక్కడాలేని విధంగా అమ్మఒడి పథకం ప్రవేశపెట్టి ప్రతి పేద విద్యార్థికి అండగా నిలిచారన్నారు. పీలేరు నియోజకవర్గంలోని ముస్లిం మైనార్టీలు తనను అభిమానించే విధంగా ఎవరిని అభిమానించరని, అందరికంటే ఎక్కువగా తననే ఆదరిస్తున్నారన్నారు. తనను అమితంగా విశ్వసిస్తున్న మైనార్టీల అభ్యున్నతికి, మసీదులు, మైనార్టీలకు చెందిన ఇతర ధార్మిక సంస్థల అభివృద్ధికి అంకితభావంతో సేవలందిస్తామన్నారు. అనంతరం నాయక్‌వీధిలోని పీర్లచావిడి మరమ్మత్తులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఏపీ ఎండిసి డైరెక్టర్‌ హరీష్‌ రెడ్డి, ఎంపిడిఒ షబ్బీర్‌ అహ్మద్‌, ఎంఇఒ వెంకటరత్నం, సింగల్‌ విండో అధ్యక్షులు రామక్రిష్ణారెడ్డి, పాఠశాల హెచ్‌ఎంలు సుబ్బారెడ్డి, శ్రీనివాస్‌, అరుణ, శ్రీదేవి, గుణశేఖర్‌, ఏ.ఆర్‌ మంజుల, వైస్‌ ఎంపిపిలు వెంకట్రమణ, కిరణ్‌ కుమార్‌, సర్పంచ్‌ గంగులమ్మ, నాయకులు చింతల ఆనందరెడ్డి, నీళ్లభాస్కర్‌, కేశవ రెడ్డి, అబ్దుల్‌ కలీమ్‌, లక్ష్మినారాయణ రెడ్డి, శ్రీనాథరెడ్డి, ఫారుఖ్‌, చెంగల్‌రెడ్డి, సుధాకర్‌ రెడ్డి, చికెన్‌మస్తాన్‌, సైఫుల్లా, సాధిక్‌, షాహెద్‌ పాల్గొన్నారు.