Sep 01,2023 23:35

ప్రజాశక్తి - కలెక్టరేట్‌ (కృష్ణా) : రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ ముగిసినప్పటికీ ఉమ్మడి కష్ణా జిల్లాలో మాత్రం నేటికీ కొనసాగుతూనే ఉంది. ప్రజా ప్రతినిధుల సిఫార్సుల లేఖలే ప్రామాణికంగా, విద్యాశాఖ కమిషనర్‌ కార్యాలయ నుండి వచ్చిన వాట్సప్‌, ఇ మెయిల్‌ ఆదేశాలతో ఈ బదిలీలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి మేలో నిబంధనలతో కూడిన ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు బదిలీల ప్రక్రియ జూన్‌ 11వ తేదీతో ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 50 వేల మంది, ఉమ్మడి కష్ణాజిల్లా వ్యాప్తంగా సుమారు నాలుగు నుండి ఐదు వేల మంది ఉపాధ్యాయులకు ఈ బదిలీలతో స్థానచలనం కలిగింది. అయితే అప్పట్లో బదిలీకి దరఖాస్తులు చేసుకొని కొంతమంది ఉపాధ్యాయులు ఇప్పుడు దొడ్డిదారిన తాము కోరుకున్న చోటకి బదిలీ చేయించుకుంటున్నారు. ఇందుకు పెద్దమొత్తంలో ముడుపులు చేతులు మారుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి ప్రక్రియ ఈసారి ఆన్‌ లైన్‌ ద్వారా జరిగింది. బదిలీల సమయంలో తిరస్కరణకు గురైన కొంతమంది ఉపాధ్యాయులు ఇప్పుడు సంబంధిత ప్రజాప్రతినిధుల ద్వారా తమ పనిని చకచకా పూర్తిచేసుకున్నట్లు సమాచారం. పక్కా ప్రణాళికతో ముఖ్యమైన స్థానాలు బ్లాక్‌చేసి ఇప్పుడు ఆ స్థానాలను ప్రజాప్రతినిధుల సిఫార్సులు లేఖలతో భర్తీ చేయించుకుంటూ కొంతమంది ఉపాధ్యాయులు అడ్డదారులు తొక్కుతున్నారన్న విమర్శలు వినబడుతున్నాయి. ఇందుకోసం రెండు లక్షల నుండి మూడు లక్షల రూపాయలు ఖర్చుపెట్టినట్లు కూడా తెలిసింది. ఇప్పుడు కోరుకున్న చోటకు బదిలీ అయితే మరో ఎనిమిదేళ్ల వరకు తమను కదిపేవారు ఉండరనే ధృమాతో ఇంత పెద్ద మొత్తంలో ముడుపులు సమర్పించి బదిలీ ఉత్తర్వులు అందుకున్నట్లు తెలుస్తోంది. గత వారం రోజులుగా ఉమ్మడి కష్ణాజిల్లాలో సుమారు 50 మందికిపైగా ఉపాధ్యాయులకు ఈ బదిలీ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. ఎటువంటి రాత పూర్వక ఉత్తర్వులు లేకుండా విద్యాశాఖ అధికారులు బదిలీల ఉత్తర్వులు ఎలా జారీ చేస్తున్నారో అర్థం కావడం లేదని పలువురు వాపోతున్నారు. ఉపాధ్యాయుల బదిలీల సందర్భంగా బదిలీ అనంతరం అవసరమైన చోట ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తామన్న ముఖ్యమంత్రి, విద్యాశాఖ కమిషనర్‌, జిల్లా విద్యాశాఖ అధికారుల ఆదేశాలను తుంగలో తొక్కి ఇప్పుడు దొడ్డిదారిన బదిలీలు చేయడంపై పలు ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి కార్యాలయమే తిరస్కరించిన ఉపాధ్యాయుల బదిలీల దరఖాస్తులను నిబంధనలకు వ్యతిరేకంగా కేవలం ప్రజాప్రతినిధుల వాట్సప్‌ ఉత్తర్వులతో ఎలా ఆమోదిస్తారని పలువురు ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా జరిగిన ఈ బదిలీలపై ముఖ్యమంత్రి కార్యాలయం దష్టి సారించాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.