- జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ ప్రారంభంలో ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి
ప్రజాశక్తి - రాయచోటి టౌన్ : వైజ్ఞానిక ప్రదర్శనలతో విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకత శక్తి వెలుగులోకి వస్తుందని రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని సాయి ఇంజినీరింగ్ కళాశాలలో శుక్రవారం నుంచి రెండు రోజుల పాటు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలనతో ఈ సైన్స్ పండగ అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులందరూ చిన్ననాటి నుండే సైన్స్ పట్ల ఆసక్తిని పెంపొందించుకోవాలన్నారు. వైజ్ఞానిక ప్రదర్శన విద్యార్థులలో దాగివున్న సృజనాత్మకతకు సాన పెట్టే విధంగా ఉండాలన్నారు. వినూత్న ఆలోచనలతో సాంకేతికతను అందిపుచ్చుకుని విద్యార్థులు అత్యున్నత స్థానానికి ఎదగాలన్నారు. గురువులపైనే విద్యార్థుల భవిష్యత్ ఆధారపడి ఉంటుందని, చిన్ననాటి నుంచే విద్యార్థులలో ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించాలని పేర్కొన్నారు. దేశం అభివృద్ధి చెందాలంటే సైన్స్‌తోనే అది సాధ్యమవుతుందన్నారు. మానవ మనుగడకు సైన్సు ఎంతగానో ఉపయోగ పడుతోందన్నారు. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా విద్యార్థులు పరిశీలించటం అలవాటు చేసుకోవాలని అప్పుడే మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చని భావి శాస్త్రవేత్తలుగా ఎదగవచ్చన్నారు. ఎపిజె అబ్దుల్ కలాం, సర్ సివి రామన్, కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ తదితర మహోన్నత వ్యక్తులను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ప్రభుత్వం విజ్ఞాన శాస్త్ర అభివృద్దికి కృషి ిచేస్తోందన్నారు. విద్యార్థులులో సృజనాత్మకను వెలికితీసేందుకు, సైన్స్‌పై ఆసక్తిని పెంపొందించేందుకు సైన్స్ ఎగ్జిబిషన్‌ను నిర్వహించడం అభినందనీయమన్నారు. మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాష మాట్లాడుతూ విద్యా రంగానికి జగన్ ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. సైన్స్ పట్ల విద్యార్థులు చిన్ననాటి నుంచే మక్కువ పెంచుకోవాలన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి ఎద్దుల రాఘవరెడ్డి మాట్లాడుతూ విద్య అంటే కేవలం మార్కుల సాధనే కాదని, జ్ఞానం, నూతన పరిశోధనల పట్ల జిజ్ఞాస పెంచుకోవటమన్నారు. విద్యార్థులు స్వేచ్ఛగా ఆలోచించే విధంగా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మార్గదర్శనం చేయాలని సూచించారు. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో అన్నమయ్య జిల్లానే మొట్టమొదటగా సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించడం గర్వంగా ఉందన్నారు. సైన్స్ అధికారి మార్ల ఓబుల్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా మండలానికి ఐదు చొప్పున 30 మండలాల నుండి 150 ప్రాజెక్టులు వచ్చాయన్నారు. వీటిలో ఉత్తమ ప్రదర్శనలను ఎంపిక చేసి రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు పంపనున్నట్లు చెప్పారు. విద్యార్థినీ విద్యార్థులకు, వారి గైడ్ టీచర్లకు వేరువేరుగా ఉచిత భోజనం, వసతి ఏర్పాటు చేశామన్నారు. సమావేశం అనంతరం విద్యార్థుల ప్రాజెక్టులను డిఇఒ ఇతర అధికారులతో కలిసి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి పరిశీలించారు. ప్రాజెక్టుల విశేషాల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో లక్కిరెడ్డిపల్లె ఎంపిపి మద్దిరేవుల సుదర్శన్‌రెడ్డి, కౌన్సిలర్లు సుగవాసి ఈశ్వర్ ప్రసాద్, సుగవాసి శ్యామ్, పిఆర్‌టియు రాష్ట్ర క్రమశిక్షణ సంఘ చైర్మన్ శ్రీనివాసరాజు, స్కౌట్స్ జిల్లా సెక్రెటరీ మడితాటి నరసింహా రెడ్డి, వైఎస్‌ఆర్‌టిఎఫ్ నేత రెడ్డెప్పరెడ్డి, సాయి విద్యా సంస్థల డైరెక్టర్ సుధాకర్‌రెడ్డి, వైసిపి నాయకులు జావీద్, అమీర్ పాల్గొన్నారు.










