అనంతపురం కలెక్టరేట్, కొత్తచెరువు : తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి మంగళవారం నాడు వర్చువల్ విధానం ద్వారా జగనన్న గోరుముద్దలో బడిపిల్లలకు ఉదయం పూట రాగిజావ అందించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నుంచి నిర్వహించిన కార్యక్రమంలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, కలెక్టర్ పి.బసంత్ కుమార్, జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ, శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్‌జె.రత్నాకర్, ఎడిసిసి బ్యాంక్ ఛైర్‌పర్సన్ లిఖిత, ఆర్డీవో భాగ్యరేఖ, ఇన్‌ఛార్జి డీఈవో మీనాక్షి పాల్గొన్నారు. అనంతపురం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్, డిప్యూటీ మేయర్లు వాసంతి సాహిత్య, కోగటం విజయ భాస్కర్ రెడ్డి, డీఈఓ ఎం. సాయిరాం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ జగనన్న గోరుముద్ద కార్యక్రమంలో మరో పోషకాహారం అందించడంలో భాగంగా బడిపిల్లలకు ఉదయం పూట రాగిజావ అందించేందుకు శ్రీకారం చుట్టామన్నారు. పిల్లలను మరింత ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దేందుకు రాగిజావ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. సత్యసాయి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 2,034 పాఠశాలల్లో జగనన్న గోరుముద్ద కార్యక్రమం అమలవుతోందన్నారు. ప్రతిరోజూ 1,46,744 మంది విద్యార్థులకు రాగిజావా అందిస్తామన్నారు. ఈ పథకం కింద కొత్త మెనూలో భాగంగా వారానికి ఐదు సార్లు కోడిగుడ్లు, వారానికి మూడుసార్లు చిక్కిలు ఇస్తామన్నారు. శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సేవాదళ సభ్యులు ప్రసాదాన్ని రాగిజావ రూపంలో పంపిణీ చేస్తూ విద్యార్థుల అభివృద్ధికి తోడ్పాటు అందివ్వడం అభినందనీయం అన్నారు. అనంతపురం జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 1,698 పాఠశాలల్లో జగనన్న గోరుముద్ద కార్యక్రమం అమలవుతోందన్నారు. ఈ పథకం కింద ప్రతిరోజూ 2,07,550 మంది విద్యార్థులు లబ్ధి పొందుతున్నారని చెప్పారు. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్‌జె.రత్నాకర్ ముఖ్యమంత్రితో వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా మాట్లాడారు. శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ తరపున ఈ గొప్ప కార్యక్రమంలో తాము భాగస్వామ్యం కావడంపై సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వర్క్ బోర్డ్ వైస్ ఛైర్మన్ షాన్‌సెట్, ఎంపీటీసీ మహమ్మద్ రఫీ, ఆవుల రాము, అనంతపురం ఏడీ ఎస్.కష్ణయ్య, డిప్యూటీ డిఇఒ పద్మప్రియ తదితరులు పాల్గొన్నారు.










