విద్యార్థినికి వైద్యం
- మానవత్వం చాటుకున్న ఎస్‌ఐ శివశంకరరావు
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్ : పట్టణంలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల పరీక్ష కేంద్రంలో తీవ్ర జ్వరంతో స్పృహతప్పి పడిపోయిన విద్యార్థినిని పోలీసు వాహనంలో ఆసుపత్రికి తీసుకెళ్లి తన సొంత ఖర్చులతో చికిత్స చేయించి పరీక్షా కేంద్రంలో వదిలిన ఆత్మకూరు ఎస్‌ఐ శివ శంకర్‌రావు మానవత్వం చాటుకున్నారని పలువురు ప్రశంసిస్తున్నారు. ఆత్మకూరులోని బాలికోన్నత పాఠశాలలో తీవ్ర జ్వరంతో పరీక్ష రాస్తూ ఉన్న స్రవంతి అనే ఇంటర్ ద్వితీయ సంవత్సర విద్యార్థిని స్పృహ తప్పి పరీక్షా కేంద్రంలో కుప్ప కూలిపోయింది. దీంతో అక్కడే విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బంది వెంటనే ఎస్‌ఐ శివశంకరరావుకు సమాచారం అందించారు. పరీక్ష కేంద్రానికి సమీపంలో ఉన్న ఆత్మకూరు ఎస్‌ఐ శివశంకరరావు హుటాహుటిన పరీక్ష కేంద్రం వద్దకు చేరుకున్నారు. స్పృహ కోల్పోయిన విద్యార్థిని అక్కడే ఉన్న పాఠశాల సిబ్బందితో కలిసి తమ పోలీసు వాహనంలోనే దగ్గరిలోని ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించి తిరిగి పరీక్షా కేంద్రంలో వదిలి ఎస్‌ఐ మానవత్వాన్ని చాటుకున్నారు. దీంతో పరీక్ష కేంద్రంలోని ఉపాధ్యాయులు, విషయం తెలుసుకోని పరిక్ష కేంద్రం వద్దకు వచ్చిన విద్యార్థిని తల్లి రవణమ్మ ఎస్‌ఐకు ధన్యవాదాలు తెలిపారు.. విషయం తెలిసి పరీక్ష కేంద్రం వద్దకు చేరుకొని విద్యార్థిని పరీక్షించిన అర్బన్ వైద్యశాల వైద్యురాలు సల్మా. పరీక్ష కేంద్రంలో పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఏవైనా ఇబ్బంది కలిగిస్తే వెంటనే సమాచారం ఇవ్వాల్సిందిగా అక్కడే ఉన్న పోలీస్ సిబ్బందికి ఎస్‌ఐ సూచించారు.










