విజయవాడ : రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యార్ధి, యువజన ప్రజాసంఘాల నాయకులు, నిరుద్యోగ పోరాట సంఘంతో చర్చించేందుకు సమయం ఇచ్చి, వారు చెప్పే విషయాలు పరిగణనలోకి తీసుకుని నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని దళిత శోషన్ ముక్తి మంచ్ (డి.యస్.యం.యం) జాతీయ కార్యదర్శి వి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. సోమవారం జరిగిన ఛలో తాడేపల్లి కార్యక్రమంలో అరెస్టు అయి విజయవాడలోని గవర్నర్ పేట, అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఉన్న నాయకులు, కార్యకర్తలు, నిరుద్యోగులను వి శ్రీనివాసరావు, కెవిపియస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి పరామర్శించారు. ఈ సందర్భంగా వి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ... ఈరోజు విజయవాడలో ఆఫీసు, రోడ్లపై ఉన్న విద్యార్ధి, యువజన ప్రజా సంఘాల నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి విజయవాడలోని వివిధ పోలీస్ స్టేషన్‌లో ఉంచడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ కోసం జాబ్ క్యాలెండర్ కాకుండా జాబ్ లెస్ క్యాలెండర్ విడుదల చేసి... రాష్ట్రప్రభుత్వం నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టిందన్నారు. నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అధికారులు, ప్రజాప్రతినిధులకు అనేక రూపాల్లో కలిసి అర్జీలు ఇవ్వడం, ఆందోళన, పోరాటాలు జరిపినా ఫలితం లేకపోవడంవల్లే ముఖ్యమంత్రిని కలిసేందుకు నిరుద్యోగ పోరాట సంఘం మరియు విద్యార్ధి యువజన ప్రజా సంఘాలు నాయకులు వచ్చారు. అయితే, వారిని అనుమతించకపోగా... అక్రమ అరెస్టులు చేయడం అన్యాయమన్నారు. అరెస్టు చేసిన ఉద్యమకారులు, నిరుద్యోగులను తక్షణం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గ్రామాల్లో తిరిగి ప్రజల మన్ననలు పొందిన జగన్... ఈరోజు ప్రజలను కలవడానికి సమయం కేటాయించకపోవటం బాధాకరం అన్నారు. కెవిపియస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి మాట్లాడుతూ... రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని రకాల ఎస్సీ ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ అరెస్టులు కెవిపియస్ ఖండించింది.










