విద్యార్థి తరగతి గదులపై ఆగ్రహం
ప్రజాశక్తి-ఉదయగిరి : విద్యార్థులు తరగతి గదిలో ఆహ్లాదకరంగా ఉండాలని శిథిలవాస్థ గదులలో బోధనపై సంబంధిత అధికారులపై రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ప్రవీణ్‌ప్రకాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మండలంలోని గడ్డవారిపల్లి స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజ్ హైస్కూళ్లను ఆయన పర్యటించారు. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన విద్యార్థులకు తరగతి గదులను ఆయన పరిశీలించి తరగతి గది నిర్మాణంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఎఆర్‌ఆర్ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన జగనన్న విద్యా కానుక స్టాక్ పాయింట్ ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యాకానుక ద్వారా విద్యార్థులకు అందిస్తున్న యూనిఫారం, బ్యాగ్, నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్, బెల్ట్, షూస్ లాంటి ఏడు రకాల వస్తువులను ఆయన పరిశీలించారు. మండలానికి అందిన జీవీకే కిట్ల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. బ్యాగులకు జిప్పులు సైతం సరిగా పడకపోవడం, కొన్ని జిప్పులు చిరిగిపోయి ఉండటం, బెల్టు 4 ఇంచులు సైజు తగ్గి ఉండడం, డిస్‌ప్లేలో ఉన్న యూనిఫారంకి సప్లై అయిన యూనిఫారంకు మధ్య నాణ్యతను, కొలతలను పరిశీలించారు. ప్రభుత్వం చెబుతున్న విధంగా నాణ్యమైన వస్తువులను విద్యార్థులకు అందించాలని జగనన్న విద్యా కానుక కిట్ వస్తువులను పంపిణీ చేస్తున్న సిబ్బందికి ఫోన్ చేసి అసహనం వ్యక్తం చేశారు. పాఠశాలలో జరుగుతున్న నాడు-నేడు పనులను పరిశీలించారు. నాడు-నేడు ద్వారా పాఠశాల రూపురేఖలు మార్చాలని, విద్యార్థులకు అందమైన, ఆహ్లాదకరమైన, వాతావరణంలో ఉపాధ్యాయులు విద్యను అందిస్తేనే వారికి మెరుగైన విద్య అందుతుందని తెలిపారు. ముఖ్యంగా విద్యార్థుల తల్లిదండ్రులకు తమ ఫోన్ నెంబర్‌ను ఇవ్వాలని ప్రతి తల్లికి తాను ఫోన్ చేసి నేరుగా మాట్లాడుతున్నట్లు తెలిపారు. ఇకనుండి తప్పిదాలు జరిగితే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో డిఇఒ గంగాభవాని, ఆర్‌జెడి సుబ్బారావు, ఎపిసి ఉషారాణి, ఎంఇఒ మస్తాన్ వలీ, ఎంపిడిఒ ఐజాక్ ప్రవీణ్, ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ ఎస్‌ఎం రెహమాన్, తదితరులు పాల్గొన్నారు.










