Mar 30,2023 22:04

ఆందోళనలో పాల్గొన్న నాయకులు

ప్రజాశక్తి - చిలమత్తూరు : మండల పరిధిలోని టేకులోడు గురుకుల పాఠశాల (మహాత్మ జ్యోతి రావు పూలే బాలికల రెసిడెన్షియల్‌ వసతి గహం)లో 8 వ తరగతి చదువుతున్న విద్యార్థిని మహిత (14) అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం రాత్రి మృతి చెందింది. ఈ నేపధ్యంలో విద్యార్థిని మృతికి గల కారణాలపై విద్యార్థి సంఘం నాయకులు పాఠశాల విద్యార్థులతో గురువారం విచారించారు. అనంతరం నాయకులు స్థానిక విలేకరులతో మాట్లాడారు. గొంతు నొప్పితో బాధపడుతున్న విద్యార్థిని ఎఎన్‌ంకు చెప్పుకోగా ఆమె 'నాటకాలు ఆడుతున్నావా' అని మందలించిందన్నారు. అనారోగ్యంతో కనీసం శ్వాస తీసుకోవడానికి బాధపడుతున్న విద్యార్థినితో వారం రోజుల క్రితం పీఈటీ గ్రౌండ్‌ లో 6 రౌండ్లు కొట్టించిందని తోటి విద్యార్థినులు తమ దృష్టికి తీసుకువచ్చారని చెప్పారు. తీవ్ర అనారోగ్యం పాలైన విద్యార్థినిని వారి బందువులు ఆసుపత్రికి తీసుకెళుతుండగా మృతిచెందిందని చెప్పారు. విద్యార్థినిపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించి విద్యార్థిని మృతికి కారణమైన ఎఎన్‌ఎం, పిఇటి, క్లాస్‌ ఇన్‌ఛార్జిని సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ గురుకుల పాఠశాల ముందు ఆందోళన చేపట్టారు.పాఠశాలలో ఇలాంటి నిర్లక్ష్య పరిస్థితులు ఉన్నా కనీసం పర్యవేక్షణ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రిన్సిపాల్‌ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. విషయం తెలుసుకున్న మండల వైధ్యాదికారి రామక్రిష్ణ పాఠశాలలో విద్యార్థులకి వైద్యపరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి బాబావలి, ఎఐఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్‌ రెడ్డి, ఎపిఎస్‌ఎఫ్‌ నాగభూషన్‌, ఎంఎస్‌ఎఫ్‌ రవికుమార్‌, ఎస్సీ ఎస్టీ విజలెన్స్‌ అండ్‌ మానటరింగ్‌ సభ్యుడు శంకరయ్య, ఎహెచ్‌ఒ పౌండేషన్‌ కో పౌండర్‌ ఎన్‌జీవో బాలక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.