Apr 05,2022 07:52

పార్టీ సారథులు

సూర్జిత్‌ తరువాత పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ప్రకాశ్‌ కరత్‌ విద్యార్థి దశ నుంచే చురుగ్గా రాజకీయాల్లో పాల్గొన్నారు. కరత్‌ 1948 ఫిబ్రవరి 7న బర్మాలో జన్మించారు. స్వస్థలం కేరళలోని పాలక్కడ్‌. ఆయన బాల్యంలో మొదటి అయిదేళ్లు అక్కడే సాగింది. తండ్రి బర్మా రైల్వేస్‌లో క్లర్క్‌గా పనిచేయడం వల్ల కుటుంబం బర్మాకు షిఫ్టు అయింది. మద్రాస్‌ క్రిస్టియన్‌ కాలేజీలో ఎకనామిక్స్‌లో అండర్‌ గ్రాడ్యుయేషన్‌ కోర్చు చదివారు. తరువాత స్కాలర్‌షిప్‌తో బ్రిటన్‌లోని ఎడిన్‌బరో యూనివర్సిటీలో రాజనీతి శాస్త్రంలో ఎంఎ చదివారు. ఆ సందర్భంగా క్యాంపస్‌లో వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడారు. అందుకు గాను యూనివర్సిటీ అధికారులు కరత్‌ను సస్పెండ్‌ చేశారు. ఆయన సత్ప్రవర్తనను చూసి తరువాత సస్పెన్షన్‌ను ఎత్తివేశారు. 'భాషలు, ప్రభుత్వ విధానాలు' అనే అంశంపై థీసిస్‌ రాసి ఎంఎస్‌ పట్టా పొందారు. ఢిల్లీలోని జెఎన్‌యులో చేరారు. 1973-74లో జెఎన్‌యు విద్యార్థి సంఘం అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. 1970లో పార్టీలో చేరి, సిపిఎం పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో అప్పటి పార్టీ పార్లమెంటరీ పక్ష నాయకుడు ఎ.కె.గోపాలన్‌కు సహాయకారిగా పనిచేశారు. 1974 నుంచి 1979 ఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఎమర్జెన్సీ కాలంలో ఏడాదిన్నరపాటు అజ్ఞాత జీవితం గడిపారు. 1979లో సిపిఎం ఢిల్లీ రాష్ట్ర కమిటీలో పనిచేస్తూ 1982-85లో రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1985లో పార్టీ కేంద్ర కమిటీ సభ్యునిగా ఎన్నికయ్యారు. 1988-91 కాలంలో కేంద్ర కమిటీ కార్యదర్శి వర్గ సభ్యునిగా పనిచేశారు. 1992లో మద్రాసులో జరిగిన 14వ పార్టీ మహాసభలో పొలిట్‌బ్యూరో సభ్యునిగా ఎన్నికయ్యారు. 2005లో ఢిల్లీలో జరిగిన మహాసభలో పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 2015 వరకు ఆ బాధ్యతల్లో కొనసాగారు. తరువాత .పీపుల్స్‌ డెమొక్రసీ సంపాదకత్వ బాధ్యతలు చేపట్టారు. పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యునిగా కొనసాగుతున్నారు. ఆయన భార్య బృందాకరత్‌ సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలిగా ఉన్నారు.