విద్యారంగంలో 'జెబి' చెరగని ముద్ర
ప్రజాశక్తి-కావలి : విద్యారంగంలో కావలి జవహర్ భారతి విద్యాసంస్థలు చెరగని ముద్ర వేశాయని, సేవే పరమావధిగా ఎందరో నిరుపేద విద్యార్థులకు విద్యాదానం చేసిన ఘనత జవహర్ భారతి విద్యా సంస్థల వ్యవస్థాపకులు డాక్టర్ రామచంద్రారెడ్డికే దక్కిందని రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం కావలి జవహర్ భారతి జూనియర్ కళాశాలకు విచ్చేసిన కొమ్మినేనికి విద్యార్థులు, అధ్యాపకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విద్యార్థుల ముఖాముఖి కార్యక్రమంలో కొమ్మినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎంతో ఘన చరిత్ర ఉన్న కావలి జవహర్ భారతి విద్యాసంస్థలను సందర్శించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ''డాక్టర్ వైఎస్‌ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ పురస్కారం'' ఈ కళాశాలకు లభించడం అభినందనీయమన్నారు. నిరుపేదలు విద్యకు దూరం కాకూడదనే సంకల్పంతో డాక్టర్ దొడ్ల రామచంద్రారెడ్డి వేసిన బీజం మహావృక్షంలా మారి ఎందరికో విద్యాదానం చేస్తోందన్నారు. విద్య, వైద్యరంగాలకు మాజీముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎంతో ప్రాధాన్యతనిచ్చి ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాలకు శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. అలాగే గతంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. ప్రధానంగా మనబడి నాడు-నేడు పథకంతో కార్పొరేట్‌కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోయాయని తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని సౌకర్యాలను వినియోగించుకుంటూ విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని పిలుపునిచ్చారు. తిరుపతి జిల్లా తడ వద్ద ఉన్న శ్రీ సిటీ పారిశ్రామిక వాడను విద్యార్థులందరూ సందర్శించి, అక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందాలని సూచించారు. అనేక దేశాలకు చెందిన పరిశ్రమలు శ్రీ సిటీలో ఉన్నాయని, వీటన్నిటినీ పరిశీలించి అవగాహన పెంపొందించుకోవాలని తెలిపారు. విశ్వోదయ రెక్టార్ దొడ్ల వినరుకుమార్ రెడ్డి మాట్లాడుతూ సువిశాల 100 ఎకరాల విస్తీర్ణంలో బాలుర, బాలికల ఉన్నత పాఠశాలలు, జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల, రెండు ఇంజనీరింగ్ కళాశాలలతో జవహర్ భారతి విద్యాసంస్థలు సేవలందిస్తున్నాయన్నారు. తమ తండ్రిగారి బాటలో పయనిస్తూ నిరుపేదలకు మెరుగైన విద్య అందించడమే లక్ష్యంగా తమ విద్యా సంస్థలు పనిచేస్తున్నాయన్నారు. 110 దేశాల్లో జవహర్ భారతి విద్యాసంస్థల విద్యార్థులు వివిధరంగాల్లో పని చేస్తున్నారని, ఇది తమ కళాశాలలకు ఎంతో గర్వకారణంగా ఆయన పేర్కొన్నారు. ముందుగా జవహర్ భారతి విద్యాసంస్థల వ్యవస్థాపకులు డాక్టర్ రామచంద్రారెడ్డి చిత్రపటానికి కొమ్మినేని శ్రీనివాసరావు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం శ్రీనివాసరావును ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో జిల్లాసమాచార, పౌర సంబంధాల అధికారి వెంకటేశ్వర ప్రసాద్, జవహర్ భారతి జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సన్నీ శామ్యూల్‌రాజు, ఇసి మెంబర్ కూనం తాతిరెడ్డి, ఫిజికల్ డైరెక్టర్ ఆర్.మాల్యాద్రి, తెలుగు అధ్యాపకురాలు సీతాకుమారి, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.










