- ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి అశోక్
ప్రజాశక్తి-ఎడ్యుకేషన్: విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని, ఫలితంగా వేలాది ప్రభుత్వ విద్యాసంస్థలు మూతపడ్డాయని, ఇప్పటికైనా విద్యా రంగ పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి ఎ.అశోక్ అన్నారు. విద్యారంగ సమస్యలు పరిష్కారం కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ధర్నా చౌక్ వద్ద సోమవారం చలో కలెక్టర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తామని ఎన్నికల్లో హామి ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత నూతన విధానాల పేరుతో ప్రభుత్వ విద్యా సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని తూట్లు పొడిచారన్నారు. ఈ పథకాన్ని ఆపివేయడం వలన ఇంటర్ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు విద్యార్థులకు అందాల్సిన ఫీజురీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్స్ పూర్తిస్థాయిలో చెల్లించలేదన్నారు. ప్రతినెలా హాస్టల్స్‌కు ఇవ్వాల్సిన కాస్మోటిక్, మెస్ ఛార్జీలు ఆరు నెలల నుండి అందడంలేదన్నారు. ఎయిడెడ్ విద్యా సంస్థల్లో జివో నెంబర్ 35 వల్ల టీచర్ల భర్తీకి దారులు మూతపడ్డాయన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ ఎన్‌టిఆర్ జిల్లా అధ్యక్షులు ఎం.సోమేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులపై వేలాది రూపాయల ఫీజుల భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉన్న యూనివర్శిటీలను మరుగున పడేసి అధ్యాపకుల పోస్టులు భర్తీ చేయకుండా అనేక విశ్వవిద్యాలయాలకు నామమాత్రపు బడ్జెట్ కేటాయించి చేతులు దులుపుకుంటున్నారన్నారు. అనంతరం స్పందన కార్యక్రమంలో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ ఎన్‌టిఆర్ జిల్లా కార్యదర్శి సిహెచ్.వెంకటేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు జి.గోపినాయక్, నాయకులు వంశీ, రిజ్వాన్, నగర నాయకులు మన్మధ, ప్రణీత, అభిషేక్, సుష్మ, భార్గవ్ పాల్గొన్నారు.










