May 13,2023 21:39

ఫొటో : మాట్లాడుతున్న రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ప్రవీణ్‌ ప్రకాష్‌

విద్యాకానుక కిట్లు నాణ్యంగా ఉండాలి
ప్రజాశక్తి-సీతారామపురం : విద్యార్థులకు అందించే జగనన్న విద్యా కానుక కిట్లు నాణ్యమైనవిగా ఉండాలని రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ప్రవీణ్‌ ప్రకాష్‌ తెలిపారు. శనివారం మండలంలో ఆయన పర్యటించారు. ఆదర్శ పాఠశాలలో ఏర్పాటుచేసిన జగనన్న విద్యా కానుక స్టాక్‌ పాయింట్‌ను ఆయన పరిశీలించారు. విద్యాకానుక ద్వారా విద్యార్థులకు అందిస్తున్న యూనిఫారం, బ్యాగ్‌, నోట్‌బుక్స్‌, టెక్స్ట్‌ బుక్స్‌, బెల్ట్‌, షూస్‌ లాంటి ఏడు రకాల వస్తువులను ఆయన పరిశీలించారు. మండలానికి అందిన జీవీకే కిట్ల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. బ్యాగులకు జిప్పులు సైతం సరిగా పడకపోవడం, కొన్ని జిప్పులు చిరిగిపోయి ఉండటం, బెల్టు 4 ఇంచులు సైజు తగ్గి ఉండడం, డిస్‌ప్లేలో ఉన్న యూనిఫారంకి సప్లయి అయిన యూనిఫారంకు మధ్య నాణ్యతను, కొలతలను పరిశీలించారు. ప్రభుత్వం చెబుతున్న విధంగా నాణ్యమైన వస్తువులను విద్యార్థులకు అందించాలని జగనన్న విద్యా కానుక కిట్‌ వస్తువులను పంపిణీ చేస్తున్న సిబ్బందికి ఫోన్‌ చేసి అసహనం వ్యక్తం చేశారు.
అనంతరం బసినేనిపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న నాడు-నేడు పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నాడు-నేడు ద్వారా పాఠశాల యొక్క రూపురేఖలు మార్చాలని, విద్యార్థిని విద్యార్థులకు అందమైన, ఆహ్లాదకరమైన, వాతావరణంలో ఉపాధ్యాయులు విద్యను అందిస్తేనే వారికి మెరుగైన విద్య అందుతుందని తెలిపారు. ముఖ్యంగా నాడు-నేడు ద్వారా క్రీడా మైదానాలు, లైబ్రరీలు, మరుగుదొడ్లు, అందమైన తరగతి గదులు, బెంచీలు, కార్పొరేట్‌ పాఠశాల తరహాలో ప్రతి పేదింటి విద్యార్థిని విద్యార్థులకు వసతులు అందించాలని తెలిపారు. కార్యక్రమంలో డిఇఒ గంగాభవాని, ఆర్‌జెడి సుబ్బారావు, ఎపిసి ఉషారాణి, ఎంఇఒ మస్తాన్‌ వలీ, ఎంపిడిఒ ఐజాక్‌ప్రవీణ్‌, ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్‌ ఎస్‌ఎం రెహమాన్‌, తదితరులు పాల్గొన్నారు.