ప్రజాశక్తి-పీలేరు: ప్రభుత్వం విద్యా రంగంలో డిజిటల్ విప్లవానికి నాంది పలికిందని పీలేరు మాజీ ఎమ్మెల్యే జివి.శ్రీనాథరెడ్డి తెలిపారు. మంగళవారం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు నటరాజ అధ్యక్షతన 116 మంది 8వ తరగతి విద్యార్థులకు, 16 మంది ఉపాధ్యాయులకు ట్యాబ్‌లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు తరగతి గది వెలుపల కూడా ట్యాబ్‌ల ద్వారా అభ్యసన చేసుకునెలా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి విద్యార్థులకు అవకాశం కల్పిస్తున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతిలో ప్రవేశం పొందిన ప్రతి విద్యార్థికీ ప్రతి సంవత్సరం మారిన కంటెంట్‌తో కూడిన ఉచిత ట్యాబ్‌లు పొందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. ఇవి ఆఫ్‌లైన్‌లో కూడా పనిచేస్తాయని తెలియజేశారు. దేశంలోనే ప్రప్రథమంగా ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే ఇలా పేద విద్యార్థులకు ట్యాబ్‌లు అందజేయడం జరుగుతోందన్నారు. జగనన్న చేసే సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలకూ స్ఫూర్తినిస్తున్నాయన్నారు. పాఠశాల చైర్మన్ సుబ్బరామిరెడ్డి, పీలేరు, కలికిరి మండలాల విద్యాశాఖాధికారులు ఎం.బాలాజీ నాయక్, రంగనాథరెడ్డి, మండల పరిషత్ ఉపాధ్యక్షులు హరితా వెంకటరమణ, ఎన్.వెంకటా చలపతి, పెద్దోడు, అల్లాబక్షు, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు నటరాజ, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. రాజంపేట అర్బన్: విద్యా ప్రగతికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎంపిటిసి బాబు పేర్కొన్నారు. మంగళవారం పెద్దకారంపల్లె ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎనిమిదవ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి రాష్ట్రంలో విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తూ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువచ్చారని పేర్కొన్నారు. నాడు-నేడు ద్వారా పాఠశాలలకు మహర్దశ కల్పించిన ఘనత ఆయనదేనని తెలిపారు. విద్యార్థులు అన్ని విధాల ముందుకెళ్లాలని ఉద్దేశంతో ట్యాబ్‌లు పంపిణీ చేస్తున్నారన్నారు. సిఎం ఆశయాలకు అనుగుణంగా విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థానాలను అధిరోహించాలని సూచించారు. కార్యక్రమంలో పెద్దకారంపల్లి వార్డు సభ్యులు మన్నూరు భాస్కర్‌రెడ్డి, వెంకటరాజు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.










