రాయచోటి : జగనన్న విదేశీ విద్యాదీవెన పేద విద్యార్థులకు వరం లాంటిదని సాంఘిక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయలక్ష్మి అన్నారు. గురువారం వెలగపూడి సచివాలయం నుంచి జగనన్న విదేశీ విద్యా దీవెన కార్యక్రమంపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నుంచి కలెక్టర్ గిరిష, సోషల్ వెల్ఫేర్ డిడి జాకీర్ హుస్సేన్, గిరిజన సంక్షేమ శాఖ అధికారి అబ్సలాం, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయలక్ష్మి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నేటి నుంచి అర్హులైన విద్యార్థులకు జగనన్న విదేశీ విద్యాదీవెన నిధులను విడుదల చేస్తామన్నారు. ఇతర దేశాలలోని యూనివర్సిటీలలో చదువుతున్న విద్యార్థులకు నిధులు జమ చేస్తామని తెలిపారు. ప్రభుత్వం మొట్ట మొదటి సారిగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పేద విద్యార్థులు విదేశాలలో ఎంబిబిఎస్ విద్యను అభ్యసించేందుకు ప్రభుత్వం ఈ నిధులు విడుదల చేయడం జరుగుతుందన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ కార్యక్రమానికి అన్ని జిల్లాలలో ఎంపికైన విద్యార్థులు వారి తల్లిదండ్రులు హాజరై విజయవంతం చేసేందుకు సంబంధిత అధికారులు కృషి చేయాలన్నారు.అనంతరం కలెక్టర్ గిరిష మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జగనన్న విదేశీ విద్యా దీవెన కార్యక్రమానికి ఎంపికైన విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు హాజరయ్యేటట్లు చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు. జగనన్న విదేశీ విద్యా దీవెన కార్యక్రమం పేద విద్యార్థులకు వరం లాంటిదన్నారు. మొట్టమొదటిసారిగా నిర్వహించే జగనన్న విదేశీ విద్యా దీవెన కార్యక్రమం గురించి ప్రతి విద్యార్థికి అవగాహన ఉండేటట్టు చూడాలన్నారు. అన్నమయ్య జిల్లా నుంచి జగనన్న విదేశీ విద్యా దీవెనకు ఎంపికైన విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొనేటట్లు చూడాలని అధికారులకు తెలిపారు.










