Mar 23,2022 06:54

    పెగాసస్‌ స్పైవేర్‌ కొనుగోలు వ్యవహారం రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపుతోంది.గతేడాది ఇంటర్నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఆఫ్‌ జర్నలిస్ట్స్‌ కన్సార్టియం (ఐసిజె) ఈ పెగాసస్‌ ఉదంతాన్ని మొదట బైట పెట్టింది. మోడీ ప్రభుత్వం ఇజ్రాయిల్‌ కు చెందిన ఈ గూఢచర్యపు స్పై వేర్‌ ను తన రాజకీయ ప్రత్యర్ధులపై ఉపయోగించిందని ఐసిజె వెల్లడించింది. తన రాజకీయ ప్రత్యర్ధులనే కాక జర్నలిస్టులను, హక్కుల కార్యకర్తలను, చివరికి సుప్రీం కోర్టు న్యాయమూర్తులను సైతం నిఘా లో ఉంచిందని, 121 మందికిపైగా ఈ చట్టవిరుద్ధమైన గూఢచర్యానికి గురయ్యారని తెలిపింది. కేంద్రం బుకాయించడంతో నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు సుప్రీం కోర్టు దీనిపై రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్‌ రవీంద్రన్‌ నేతృత్వంలో ఒక త్రిసభ్య కమిటీని, ఫోరెన్సిక్‌ సైన్స్‌ యూనివర్శిటీ డీన్‌ నవీన్‌ కుమార్‌ సారథ్యంలో ముగ్గురితో టెక్నికల్‌ కమిటీని ఏర్పాటు చేసింది. ఇంకా ఆ కమిటీ నివేదిక రాలేదు. తాజాగా బెంగాల్‌ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఇటీవల చేసిన వ్యాఖ్యలు పెగాసస్‌ కుంభకోణంలోని మరో పార్శ్వాన్ని బయటపెట్టాయి . నాలుగేళ్ల క్రితం ఇజ్రాయిల్‌ కంపెనీ పెగాసస్‌ బెంగాల్‌ ప్రభుత్వాన్ని సంప్రదించి, అప్పట్లో రూ.25 కోట్లకు ఈ టెక్నాలజీని అమ్మజూపిందని, తన ప్రభుత్వం తిరస్కరించగా, ఆంధ్ర ప్రదేశ్‌లో చంద్రబాబు ప్రభుత్వం కొనుగోలు చేసిందని బెంగాల్‌ అసెంబ్లీ వేదికగా . మమత బెనర్జీ ప్రకటించారు.దీనితో మన రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఇదొక పెద్ద వివాదంగా మారింది. . పెగాసస్‌ తమను సంప్రదించిన మాట నిజమే, కానీ, ఆ స్పైవేర్‌ను తాము కొనలేదని అప్పటి ఐటి శాఖ మంత్రి నారా లోకేష్‌ చెప్పారుపెగాసస్‌ స్పైవేర్‌ను తాము ఉపయోగించి ఉంటే వైసిపి గెలిచేదా అని తొలుత వ్యాఖ్యానించారు ఆర్‌టిఐ ప్రశ్నకు వైసిపి ప్రభుత్వ హయాంలో పోలీస్‌ డిపార్టుమెంట్‌ ఇచ్చిన సమాధానాన్ని చూపి తాము ఏ తప్పు చేయలేదని చెప్పారు. .పెగాసస్‌ రాష్ట్ర ప్రభుత్వానికి స్పైవేర్‌ను అమ్మజూపిందనే విషయాన్ని తమ ప్రభుత్వ హయాంలోనే ఎందుకు బహిర్గతం చేయలేదు అన్నది ఇక్కడ ప్రశ్న. 2017లో రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ విభాగం డైరక్టర్‌ జనరల్‌ ఎబి వెంకటేశ్వరరావు రెండు సార్లు ఇజ్రాయిల్‌ ఎందుకు వెళ్లారనేది మరో ప్రశ్న. ఆ పోలీస్‌ అధికారి కుమారుడికి చెందిన కంపెనీకి ఇజ్రాయిల్‌ నుంచి డ్రోన్ల కొనుగోలు కాంట్రాక్టు అప్పగింత వంటివి పలు అనుమానాలకు తావిస్తున్నాయి.తమ ప్రభుత్వం కొనుగోలు చేసిందని ప్రకటన చేసిన మమత బెనర్జీని తెలుగుదేశం ఎందుకు గట్టిగా ప్రశ్నించలేకపోతోంది?
    ఇక వైసిపి ప్రభుత్వ ధోరణి సైతం సవ్యంగా లేదు.. చంద్రబాబు పాత్ర గురించి వార్తలు రాగానే ఆ కుంభకోణం ఇప్పుడే కొత్తగా తలెత్తినట్టుగా మాట్లాడుతోంది. ఈ వ్యవహారం గురించి ప్రధానమంత్రికి ఫిర్యాదు చేస్తామని వైసిపి ఎంపీలు చెబుతున్నారు. పెగాసస్‌లో పీకల్లోతున కూరుకుపోయిన మోడీ సర్కార్‌ను పెద్దరికం పాత్ర పోషించమని అడగడమే విడ్డూరం.వాస్తవానికి దేశ భద్రతకు సంబంధించిన వ్యవహారమైనందున, ఆ విదేశీ నిఘా టెక్నాలజీని రాష్ట్రాలకు అమ్మేందుకు ఒక విదేశీ గూఢచారి సంస్థకు కేంద్రం ఎలా అనుమతించారని అడగాలి.ఒకవేళ ఈ సంగతి కూడా తమకు తెలియకుండానే జరిగిందని మోడీ ప్రభుత్వం బుకాయిస్తే అంతకన్నా సిగ్గుచేటైన విషయం ఇంకోటి ఉండదు. ఒక విదేశీ గూఢచర్య సంస్థ మనదేశంలో ఆ యా రాష్ట్రాలతో నేరుగా వ్యాపారాన్ని నడపబూనుకుంటే కేంద్రం ఏ గుడ్డి గుర్రం పళ్ళు తోముతోంది ? ఇదేనా సమర్ధ పాలన ?
మన దేశంలో ప్రజాస్వామ్యం ఎంత ప్రమాదంలో పడిందో ఈ ఉదంతం వెల్లడి చేస్తోంది. దానితోబాటు దేశ ఆంతరంగడిక భద్రత విదేశీ గూఢచర్య కుట్రలకు లక్ష్యంగా మారిందన్న వాస్తవం కూడా కనపడుతోంది. ప్రధాన బాధ్యత ఉన్న బిజెపి గురించి అటు టిడిపి గాని ఇటు వైసిపి గాని నోరెత్తడం లేదు.గతంలో పార్లమెంటులో ఈ వ్యవహారంలో జెపిసి వేయాలన్న ప్రతిపక్షాల డిమాండ్‌ ను ఈ రెండు పార్టీలూ బలపరచలేదు. కేంద్రాన్ని ఈ విషయంలో ప్రశ్నించే ధైర్యమే ఈ పార్టీలకు లేకపోతే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి గ్యారంటీ ఇంకెక్కడ ?
   వ్యక్తుల స్వేచ్ఛ, రాజకీయ స్వేచ్ఛ, నిరసన తెలిపే హక్కు, సంఘటితమయే హక్కు, భావ ప్రకటనా స్వేచ్ఛ- అన్నీ పెనుముప్పునెదుర్కుంటున్నాయని ఈ ఉదంతం మరోసారి సూచిస్తోంది. ప్రజాస్వామిక, దేశభక్తియుత శక్తులన్నీ ఈ విషయంలో బలంగా తమ వాణిని వినిపించాలి.