Aug 17,2021 06:34

     దేశ విభజన సమయంలో ప్రజలు పడ్డ బాధలను గుర్తు చేసుకుంటూ ఇక మీదట ప్రతి ఏటా ఆగస్టు 14వ తేదీన 'విభజన గాయాల స్మారక దినం' జరుపుకోవాలన్న ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటన ఫక్తు కుట్ర పూరితం. ముస్లిం మైనార్టీలను లక్ష్యంగా చేసుకొని హిందూ మతోన్మాదాన్ని ప్రేరేపించే దుర్బుద్ధికి కార్యరూపమే ఈ స్మారక దినం నిర్వహణ నిర్ణయం. దేశ విభజన బాధను ఎప్పటికీ మర్చిపోలేమని, విద్వేషం, హింస కారణంగా లక్షలాది మంది నిర్వాసితులు కావడంతో పాటు ప్రాణాలు పోగొట్టుకున్నారని, బ్రిటిష్‌ వారి నుండి స్వాతంత్య్రం పొందిన సంతోషం వెన్నంటే విభజన వేదనలూ ఉన్నాయని తెగ బాధ ఒలకబోశారు ప్రధాని. వాస్తవానికి స్వాతంత్య్రోద్యమ కాలంలో దేశ విభజనను కోరుకున్నది ఆర్‌ఎస్‌ఎస్‌, హిందూ మహాసభ. ద్విజాతి సిద్ధాంతాన్ని ముందుకు తీసుకొచ్చిందే వారు. హిందువులకు, ముస్లింలకు వేర్వేరు దేశాలుండాలని సైద్ధాంతీకరించిందీ వారే. వారు పెట్టిన చిచ్చుతోనే బ్రిటిష్‌ ప్రభుత్వం మన దేశాన్ని పాకిస్థాన్‌, భారత్‌గా విడగొట్టి అధికారం నుండి నిష్క్రమించింది. నాడు విభజనను కోరుకున్న హిందూ మహాసభ, ఆర్‌ఎస్‌ఎస్‌ కుదురు నుండి పుట్టుకొచ్చిందే బిజెపి. తన అసలు చరిత్రను చెరిపేయడానికి, వాస్తవాల నుండి ప్రజలను తప్పుదారి పట్టించడానికి ప్రధాని మోడీ, బిజెపి మరోసారి దేశ విభజన అంశాన్ని తెరమీదికి తెచ్చారన్నది సుస్పష్టం. ఇదే సమయంలో ముస్లిం మైనార్టీలే లక్ష్యంగా ప్రజల్లో చీలికలు సృష్టించడం ద్వారా తన ఏకరూప సిద్ధాంతం అమలుకు వ్యూహ రచన అనేది ఎంతగా దాచినా దాగని సత్యం.
     స్వాతంత్య్రోద్యమం అనేక స్రవంతుల కలయికతో సాగిన మహత్తర పోరాట ఘట్టం. అన్ని మతాల, కులాల, ప్రాంతాల, సిద్ధాంతాల మేలు కలయిక. స్వాతంత్య్ర పోరాటంలో ఎక్కడా ఆర్‌ఎస్‌ఎస్‌ పాల్గొనలేదు సరికదా బ్రిటిష్‌ వారికి అనుకూలంగా పని చేసింది. ఆర్‌ఎస్‌ఎస్‌ ముఖ్య నాయకులు బ్రిటిష్‌ ప్రభుత్వానికి క్షమాపణ పత్రాలు రాసిచ్చి, అప్రూవర్లుగా మారి జైళ్ల నుండి బయటకొచ్చారు. బ్రిటిష్‌ వారి విభజన సిద్ధాంతానికి ఆర్‌ఎస్‌ఎస్‌ మద్దతు పలికింది. దేశ విభజనకు సుతరాం ఇష్టపడనందున, హిందూ-ముస్లిం భాయి భాయి అన్న కారణంగానే గాంధీజీని నాథూరాం గాడ్సే హత్య చేశాడు. ఇప్పటికీ ఆర్‌ఎస్‌ఎస్‌, పరివారం, బిజెపి గణాలు గాంధీని బలిగొన్న గాడ్సేని అపర దేశభక్తునిగా బహిరంగంగానే కీర్తిస్తున్నాయి. విభజన సమయంలో హింసోన్మాదాన్ని రెచ్చగొట్టింది ఆర్‌ఎస్‌ఎస్‌, అనుబంధ సంస్థలే. నాటి మత విద్వేష ఘర్షణలకు కోట్లాది మంది ప్రభావితమయ్యారు. లక్షల మంది తమ స్వంత ఊళ్లు, పట్టణాలు, నగరాలు విడిచి వలసలు పోయారు. హింసలో లక్షల కుటుంబాలు సర్వం కోల్పోయాయి. హత్యలకు, ఊచకోతలకు, దాడులకు గురయ్యారు. మానవ జాతి చరిత్రలో ఎన్నడూ చూడని రీతిలో మారణహోమం సృష్టించిన చేతులతోనే బాధితుల స్మారక దినం నిర్వహించడం హంతకులే శ్రద్ధాంజలి ఘటించడం వంటిది. మళ్లీ నాటి ఘోరాలు, భయంకర రోజులు, విషాద పునరావృతానికే స్మృతి దినం.
    కేంద్రంలో బిజెపి అధికారంలోకొచ్చాక, తన మాతృక ఆర్‌ఎస్‌ఎస్‌ లక్ష్యమైన హిందూరాజ్య స్థాపన దిశగా కార్యాచరణకు పదును పెడుతోంది. పౌరసత్వ చట్ట సవరణ చట్టం, కాశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించే 370 అధికరణ, 35ఎ రద్దు వంటి వివాదాస్పద చర్యలు చేపట్టింది. బిజెపి పాలిత రాష్ట్రాలు సైతం ఆ బాటనే నడుస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో యోగి సర్కారు ప్రతిపాదించిన జనాభా నియంత్రణ చట్టం, పశువుల రవాణాపై నియంత్రణ, గోవధ నిషేధం వంటివి ముస్లిం మైనార్టీలను లక్ష్యంగా చేసుకున్నవే. దేశ విభజన కోసం 1940 మార్చి 22న ముస్లింలీగ్‌ తీర్మానం చేసిన రోజును పురస్కరించుకొని పాకిస్థాన్‌ ఏటా జరుపుకునే 'నేషనల్‌ డే ఆఫ్‌ పాకిస్థాన్‌' సందర్భంగా ఆ దేశ ప్రధానికి మోడీ శుభాకాంక్షలు పంపారు. పాకిస్థాన్‌ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలూ తెలుపుతున్నారు. ఇప్పుడేమో విభజన గాయాల స్మారక దినం అంటున్నారు. నిజానికి విభజన గాయాలను మళ్లీ పెచ్చరిల్లజేయడమే బిజెపి ఎజెండా. ఇది రాజ్యాంగ మౌలిక సూత్రాలైన లౌకికతత్వానికి, సౌభ్రాతృత్వానికి విఘాతం. ప్రజల్లో విద్వేషాలు రాజేసే బిజెపి విద్రోహ చర్యలను లౌకిక, ప్రజాతంత్ర వాదులు, రాజ్యాంగ ప్రేమికులు నిరసించాలి. ప్రజలూ అప్రమత్తం కావాలి.