Apr 28,2023 21:20

మాట్లాడుతున్న సిపిఐ జిల్లా కార్యదర్శి నరసింహులు

ములకలచెరువు : రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు, రాష్ట్ర విభజన హమీలను బిజెపి ప్రభుత్వం తుంగలో తొక్కిందని సిపిఐ, సిపిఎం జిల్లా కార్యదర్శులు నరసింహులు, శ్రీనివాసులు పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై, ఉభయ వామక్ష పార్టీల రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రచార భేరి కార్యక్రమంలో శుక్రవారం ములకలచెరువులో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర విభజన హమీల అమలు, పోలవరం ప్రాజెక్టుకు నిధులు, రాజధాని నిర్మాణం, రైల్వేజోన్‌తో పాటు వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రాకు ప్రత్యేక ఫ్యాకేజీ ఇచ్చిన హమీలను కేంద్ర ప్రభుత్వం ఏ ఒక్కటి అమలు చేయకుండా ఆంధ్రులకు నమ్మక ద్రోహం చేసిందని విమర్శించారు. వ్యవసాయాన్ని సైతం కార్పొరేటర్లకు ధారాదత్తం చేస్తోందని తెలిపారు. దేశంలోనే అడవులను, భూములను, విద్యుత్‌ ప్రాజెక్టులను, గనులను సైతం కార్పొరేటర్లకు అక్రమంగా కట్టబెడుతుందన్నారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ గంగవరం, కృష్ణపట్నం వంటి కీలకమైన ఓడరేవులను హైడ్రో విద్యుత్‌ ప్రాజెక్టులను సోలార్‌ విద్యుత్‌ కోసం ఎంతో విలువైన భూములను సైతం ఆదానికి సమర్పించుకుంటూ ఉందని, మోడీ ఆదేశాలకు లొంగి ప్రజల మీద విద్యత్‌ స్మార్ట్‌ మీటర్లను అధిక భారాలను జగన్‌ సర్రార్‌ రుద్దుతోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు సాంబశివ, తంబళ్లపల్లి నియోజకవర్గ కార్యదర్శి మనోహర్‌రెడ్డి, రాష్ట్ర సమితి సభ్యుడు కృష్ణప్ప, నాయకులు మహేష్‌, హరిశర్మ, అంజనప్ప, ఆనంద్‌, వెంకటస్వామి, జయకర్‌, ఆదినారాయణ, సుధాకర్‌ పాల్గొన్నారు.