ఇటీవల జరిగిన వెనిజులా పార్లమెంట్ ఎన్నికల్లో మదురో నాయకత్వం లోని యునైటెడ్ సోషలిస్టు పార్టీ (పిఎస్‌యువి), ఇతర వామపక్ష పార్టీలతో కూడిన గ్రేట్ పేట్రియాటిక్ పోల్ (జిపిపి) కూటమి సాధించిన విజయం లాటిన్ అమెరికాలో వామపక్షాలదే భవిష్యత్ అని మరో మారు నిరూపించింది. మొత్తం 277 స్థానాలు ఉన్న పార్లమెంట్‌లో 75 శాతం సీట్లను ఈ కూటమి గెలుచుకుని తిరుగులేని ఆధిక్యత ప్రదర్శించింది. పోలైన మొత్తం ఓట్లలో జిపిపి కూటమి 68.43 శాతం ఓట్లతో మొదటి స్థానంలో నిలవగా, ప్రతిపక్ష డెమొక్రటిక్ అలయెన్స్ కూటమి 17.51శాతం ఓట్లతో రెండవ స్థానంలో, యునైటెడ్ వెనిజులా అలయెన్స్ (ఎవియు) 4.15 శాతం ఓట్లతో ఆ తర్వాతి స్థానంలో నిలిచాయి. వెనిజులా కమ్యూనిస్టు పార్టీ (పిసివి)కి 2.7 శాతం ఓట్లు పోలయ్యాయి. ఐదేళ ్ల క్రితం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సాధించిన జువాన్ గెయిడో నేతృత్వంలోని ప్రతిపక్ష పార్టీ మదురో సారథ్యంలోని సోషలిస్టు ప్రభుత్వాన్ని కూలదోసేందుకు అమెరికా, దాని మిత్రపక్షాలతో బాహాటంగా చేతులు కలిపాడు. మదురో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు అడుగడుగునా అడ్డుపడడమే కాకుండా, అమెరికా అండతో తనకు తాను తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించుకున్నాడు. ఈ కుట్రలన్నిటిని అధిగమించి డిసెంబరు 6 ఎన్నికల్లో పిఎస్‌యువి నేతృత్వంలోని జిజిపి కూటమి 68 శాతం ఓట్లతో మూడింట రెండొంతుల మెజార్టీని సాధించడం చిన్న విషయమేమీ కాదు. ఇప్పుడు ఈ విజయంతో మదురో ప్రభుత్వం తన ప్రజానుకూల విధానాలను నిశ్చయంగా ముందుకు తీసుకువెళ్లేందుకు మార్గం సుగమమైంది. ఎన్నికల బరిలోకి దిగితే ప్రజలు ఛీ కొడతారన్న భయంతో గెయిడో ఆధ్యర్యంలోని ప్రతిపక్ష ఇండిపెండెంట్ పార్టీ వీటిని బహిష్కరించింది. ఎన్నికలను ప్రతిపక్షాలన్నీ ఐక్యంగా బహిష్కరించాలన్న గెయిడో పిలుపును ఎవరూ ఖాతరు చేయలేదు. ఎన్నికల ఫలితాలు మదురోకు అనుకూలంగా రావడంతో వీటిని గుర్తించేందుకు అమెరికా, ఇ.యు నిరాకరించడం వాటి కుట్ర బుద్ధిని తెలియజేస్తుంది. ఎన్నికలను పర్యవేక్షించిన 1500 మంది జాతీయ ఎన్నికల పరిశీలకులు, 200 మంది విదేశీ పరిశీలకులు ఇవి అత్యంత సాఫీగా, స్వేచ్ఛాయుతంగా జరిగాయని ప్రకటించిన తరువాత కూడా రిగ్గింగ్ గురించి మాట్లాడడం వాటి దివాళాకోరుతనాన్ని తెలియజేస్తుంది. వెనిజులాలో తమ తొత్తు ప్రభత్వాన్ని నెలకొల్పడం ద్వారా ఆ దేశంలోని అపారమైన చమురు నిల్వలను, ఇతర సహజ వనరులను కొల్లగొట్టుకుపోవాలన్నది వాటి పన్నాగం. సోషలిస్టు ప్రభుత్వం అధికారంలో ఉండగా ఇది సాధ్యం కాదు కాబట్టి దానిపై కత్తిగట్టాయి. హ్యూగో ఛావెజ్ కాలం నాటి నుండే ఈ కుట్రలు సాగిస్తున్నప్పటికీ వెనిజులా ప్రజానీకం వాటిని ఇంతవరకు సాగనివ్వలేదు. అక్కడ సైన్యం కూడా ప్రజల పక్షానే నిలవడం ముదావహం.
పార్లమెంటు ఎన్నికల్లోనే కాదు, ప్రాంతీయ అసెంబ్లీ, స్థానిక సంస్థల్లోనూ మదురో పార్టీ నేతృత్వంలోని కూటమికి గట్టి పట్టు ఉంది. 23 గవర్నర్ స్థానాలకుగాను 19 స్థానాలను, అలాగే 335 మేయర్ స్థానాలకుగానూ 305 స్థానాలను, ప్రాంతీయ అసెంబ్లీకి సంబంధించి 251 స్థానాలకుగాను 227 స్థానాలను అది సాధించింది.
1990వ దశకం చివరిలో లాటిన్ అమెరికాలో వెల్లువలా వచ్చిన పింక్ విప్లవం ఈ ప్రాంతంలోని వామపక్ష శక్తులకు ఊపునిచ్చింది. ముఖ్యంగా 1998లో హ్యూగో ఛావెజ్ వెనిజులా అధ్యక్షుడిగా ఎన్నిక కావడం లాటిన్ అమెరికా రాజకీయాలను ఒక మలుపు తిప్పింది. నయా ఉదారవాద విధానాల వ్యతిరేకతే ప్రధాన అంశంగా మొదలయిన ఈ ఉద్యమం లాటిన్ అమెరికాలో ప్రపంచీకరణ అనుకూల, సామ్రాజ్యవాద ఏజెంట్లుగా వ్యవహరించిన ప్రభుత్వాలను మట్టి కరిపించి, ప్రగతిశీల శక్తులు అధికారంలోకి రావటానికి బాటలు వేసింది. నెస్టర్ కిర్చెనర్, (2003-07), ఆయన భార్య క్రిస్టినా ఫెర్నాండెజ్ డి కిర్చెనర్ (2007-15) అర్జెంటీనాలో, వర్కర్స్ పార్టీ నాయకుడు లూలా డి సిల్వా (2003-10), దిల్మా రౌసెఫ్ (2011-15) బ్రెజిల్‌లో, ఇవో మొరేల్స్ (2006-19) బొలీవియాలో వామపక్ష ప్రభుత్వాలకు నేతృత్వం వహించారు. లాటిన్ అమెరికాలో వామపక్ష ఉద్యమం ఉచ్ఛ స్థితికి చేరుతున్న తరుణంలో దీనిని దెబ్బ తీయటానికి అమెరికా, ఆర్గనైజేషన్ ఆఫ్ అమెరికన్ స్టేట్స్, కార్పొరేట్లు కలసి కుట్రల మీద కుట్రలు పన్నాయి. 2009లో హౌండూరస్ అధ్యక్షుడు మాన్యుయల్ సెలయాను కుట్ర ద్వారా కూల్చివేయడంతో మితవాద శక్తులు తిరిగి తలెత్తే క్రమం మొదలైంది. 2016లో డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టాక ఈ మితవాద శక్తులకు మరింత బలం చేకూరినట్లైంది. బ్రెజిల్ అధ్యక్షురాలు దిల్మా రౌసెఫ్‌ను పార్లమెంటరీ కుట్ర ద్వారా కూల్చివేసి, పచ్చి మితవాది జెయిర్ బోల్సనారో అధికారంలోకి వచ్చాడు. బొలీవియాలో మరోసారి ఎన్నికల్లో స్పష్టమైన ఆధిక్యతతో గెలుపొందిన ఇవో మొరెల్స్‌ను సైనిక కుట్ర ద్వారా కూల్చివేశారు. దీంతో వామపక్షాల పని అయిపోయిందని సామ్రాజ్యవాద శక్తులు సంబర పడ్డాయి. అయితే, మానవాళి విమోచన కోసం ఉద్యమిస్తున్నంత కాలం వామపక్షాలను ఏ శక్తులూ ఓడించలేవని వెనిజులా ఫలితాలు రుజువు చేశాయి.










