- వెంటాడుతున్న ఎల్‌జి పాలిమర్స్ విషవాయువు లీకేజీ ఘటన
- రెండేళ్లయినా పట్టించుకున్నదీ లేదు
- డాక్టర్ లేడు...వైద్య సిబ్బందీ రారు
ప్రజాశక్తి - గ్రేటర్ విశాఖ బ్యూరో : ఆర్‌ఆర్.వెంకటాపురం గ్రామాన్ని రెండేళ్లుగా ఎల్‌జి పాలిమర్స్ విషయవాయువు లీకేజీ గాయం వెంటాడుతోంది. ప్రతి ఇంటిలోనూ అనారోగ్యం పాలైన వారు ఒక్కరైనా దర్శనమివ్వడం చూస్తే ప్రభుత్వం, అధికార యంత్రాంగం ఈ బాధిత గ్రామం పట్ల చూపించిన అశ్రద్ధ అర్థమవుతోంది. 2020 మే 7న తెల్లారుజామున 3 గంటల సమయం... ఊరు జనం అంతా గాఢనిద్రలో ఉండగా ప్రమాదకరమైన విషవాయువు చిక్కటి పొగ రూపంలో ఇళ్లల్లోకి జొరబడటంతో 15 మంది మరణించిన ఘటన అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇది దేశంలోనే భారీ దుర్ఘటనగా నమోదైంది. దక్షిణ కొరియాకు చెందిన కార్పొరేట్ దిగ్గజ ఎల్‌జి పాలిమర్స్ కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా స్టోరేజీ ట్యాంకుల నుంచి వెలువడిన విషవాయువు గ్రామంలోని వందల మందిని అప్పట్లో ఆసుపత్రి పాలుచేసింది. పరామర్శకు సైతం ఎవరూ రావడం లేదని తాజాగా గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు.
లీకేజీ గాయంతోనే జీవనం
ఘటన జరిగి రెండేళ్ళు పూర్తికావస్తున్నా...ఆ గాయం నుంచి ఇంకా ప్రజలు తేరుకోవడం లేదు. యువకులందరూ ముడుకుల నొప్పి, ఆయాసంతో జీవనం సాగిస్తున్నారు. గ్రామానికి చెందిన నమ్మి రవి (42) ముడుకుల నొప్పి, ఆయాసంతో ఏ పనీ చేయలేని స్థితిలో ఉన్నాడు. కన్నా అనే యువకుడు శ్వాసకోస వ్యాధులతో జీవిస్తున్నారు. ఇంతవరకూ ఊర్లో డాక్టరు లేడు.. వైద్య సిబ్బంది రారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీయేగాక, ఎన్‌జిటి, ఎన్‌టిఆర్ హెల్త్ యూనివర్శిటీ నిపుణుల కమిటీ అందరూ చెప్పిన విషయం ఏమిటంటే... 5ఏళ్ల పాటు గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిరంతరాయంగా నిర్వహించాలన్న నివేదికలను రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టేసింది.
ప్రభుత్వ హంగామాతో మోసపోయిన గ్రామస్తులు
వెంకటాపురం గ్రామంలో రాష్ట్ర మంత్రులు బొత్స సత్యనారాయణ, ముత్తంశెట్టి శ్రీనివాసరావు అప్పటికప్పుడు మల్టీ స్పెషాల్టీ ఆసుపత్రి నిర్మాణం కోసం 2020లో శంకుస్థాపన చేశారు. కానీ నేటి వరకు ఒక్క ఇటుక కూడా పేర్చలేదు సరికదా... తాజాగా అధికార వైసిపికి చెందిన ఓ నాయకుడు ఆర్‌ఆర్.వెంకటాపురం రోడ్డులో ప్రైవేటు సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రి నిర్మించుకోవడానికి ప్రభుత్వం అనుమతులను మంజూరు చేసింది. దీంతో ఘటన జరిగినప్పుడు ప్రభుత్వ పెద్దలు ఇచ్చిన హామీలు, చేసిన హడావుడి వారి పార్టీ నాయకుడి ఆర్థిక ప్రయోజనం కోసమేనని ఇప్పుడిప్పుడే గ్రామ ప్రజలకు అర్థమవుతోంది.
పచ్చినిజాలు బయటపెట్టిన అధ్యయన కమిటీలు...
రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనానంతరం వేసిన హైపవర్ కమిటీ పచ్చినిజాలను వెల్లడించింది. ఎల్‌జి యాజమాన్యంలో రిస్క్ అసెస్‌మెంట్ రెస్పాన్స్ అత్యంత పూర్‌గా ఉందని, సేఫ్టీ మేనేజ్‌మెంట్ సిస్టం నాసిరకంగా నిర్వహిస్తున్నారని, కెమికల్ ప్రాపర్టీస్ ట్యాంకులో ఎంత ఉండాలి? కూలింగ్ ఎంత అవసరమో తెలియకుండా యాజమాన్యం అత్యంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన విషయాన్ని బహిర్గతం చేసింది. 800 మంది ఆసుపత్రి పాలయ్యారని, అక్కడికక్కడే 12 మంది, తర్వాత ముగ్గురు మృతిచెందినట్లు నిపుణుల కమిటీ ఈ ప్రాంతంలో పర్యటించి తెలిపింది. నీరు, ఇసుక కాలుష్యపూరితం అవ్వడానికి కూడా ఈ విషవాయువు దోహదపడిందని, అందువల్లనే నేటికీ ఇక్కడి ప్రజలు ఆయాసం, దగ్గు, జ్వరాలు, ముడుకుల నొప్పులతో బాధపడుతున్నారని ఎన్‌టిఆర్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అధ్యయన బృందం పరిశీలన చేసి ప్రభుత్వానికి నివేదించింది.
రూ.50కోట్లు గ్రామస్తుల కోసం జిల్లా కలెక్టర్ అకౌంట్‌లో డిపాజిట్ చేయాలని ఎల్‌జిపాలిమర్స్ యాజమాన్యాన్ని అప్పట్లో ఎన్‌జిటి ఆదేశించింది. గ్రామస్తుల బాగోగులన్నీ చూసేశామని, రూ.50కోట్లు వెనక్కి ఇచ్చేయాలంటూ తాజాగా యాజమాన్యం కోర్టుకెక్కింది. ఈ నిధులనూ గ్రామ అభివృద్ధికి ఖర్చు చేయాలని అప్పట్లో ప్రభుత్వానికి ఎన్‌జిటి సిఫారసు చేసింది. కానీ ఎల్‌జి యాజమాన్యం ఈ నిధినీ కొట్టేయాలని చూడడం విశేషం.










