ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : సభ్యులు ప్రజా సమస్యలపై చర్చకు ముందుకు రావాలని, వెల్‌లో ఆందోళన చేయడం మంచి సంకేతం కాదని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. పార్లమెంట్‌లోని ఎనెక్స్ కాంప్లెక్స్ కమిటీ రూమ్‌లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 19 నుంచి వచ్చే నెల 13 వరకు 19 రోజులపాటు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతాయని తెలిపారు. కోవిడ్ ఉన్నప్పటికీ 17వ లోక్‌సభ మునుపటి లోక్‌సభలతో పోలిస్తే మొదటి ఐదు సెషన్లలో రికార్డు స్థాయిలో పనిచేసిందని వివరించారు. పార్లమెంట్‌లో ఉభయ సభలు కరోనాకు పూర్వం ఉన్న వేళల ప్రకారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఏకకాలంలో పనిచేస్తాయని చెప్పారు. 280 మంది సభ్యులు సభా ఛాంబర్‌లో, 259 మంది సభ్యులు గ్యాలరీలో కూర్చుంటారన్నారు. వ్యాక్సిన్ కనీసం ఒక మోతాదులో తీసుకున్న సభ్యులకు ఆర్‌టిపిసిఆర్ తప్పనిసరి కాదన్నారు. ఇప్పటికే 411 మంది సభ్యులు టీకాలు తీసుకున్నారని, మిగతా సభ్యులు విభిన్న వైద్య కారణాల వల్ల టీకా తీసుకోలేదని స్పీకర్ వివరించారు. వాక్సిన్ తీసుకోనివారికి పార్లమెంటు భవనంలో ఆర్‌టిపిసిఆర్ పరీక్ష సౌకర్యం అందుబాటులో ఉంటుందన్నారు. కరోనా ఆంక్షల కారణంగా సందర్శకులను అనుమతించబోమని స్పీకర్ తెలిపారు. అన్ని పార్లమెంటరీ వ్యవహారాలు అందుబాటులో ఉండేలా ఒక యాప్ రూపొందిస్తున్నామని, మరో పదిహేను ఇరవై రోజుల్లో అందుబాటులోకి వస్తుందని చెప్పారు. సమావేశాల ప్రత్యక్ష ప్రసారాలతో పాటు ప్రశ్నోత్తరాలు, చర్చల రికార్డులు అందుబాటులో ఉంటాయన్నారు. నిర్ణీత సమయంలోగా కొత్త పార్లమెంటు భవన నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు. పార్లమెంటు లైబ్రరీ, రాష్ట్ర శాసనసభల లైబ్రరీలు ఒకే డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. అంతకుముందు ఆయన సమావేశాల ఏర్పాట్లను పరిశీలించారు. పార్లమెంటు భవన కాంప్లెక్స్‌లో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయా? లేవా? దానిపై ఆరా తీశారు.
అనర్హత పిటిషన్‌పై వివరణ కోరతాం
నర్సాపురం ఎంపి రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు వేయాలని వైసిపి ఇచ్చిన పిటిషన్‌పై ఆయన వివరణ కోరతామని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన పిటిషన్లను పరిష్కరించేందుకు నిర్ధిష్ట కాలపరిమితి ఉండాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. క్రితంసారి స్పీకర్ల సదస్సు జరిగినప్పుడు ఈ అంశం ప్రస్తావనకు వచ్చిందని, ఈ సదస్సు నివేదికను ప్రభుత్వానికి నివేదిస్తామని చెప్పారు. ప్రభుత్వం ఈ దిశగా ఫిరాయింపుల నిరోధక చట్టంలో మార్పులు చేస్తే నిర్ధిష్ట కాల వ్యవధిలో నిర్ణయం తీసుకునే వీలుంటుందని స్పీకర్ పేర్కొన్నారు. ''ఏదైనా పిటిషన్ నా ముందుకు వచ్చినప్పుడు మా సచివాలయం దానిని పరిశీలిస్తుంది. దానిపై నిర్ణయం తీసుకునే వరకు దాని వివరాలు బహిర్గతం చేయం. అది అంతర్గత అంశం. ఫిరాయింపుల నిరోధక చట్టంలోని నియమావళి మేరకు ప్రక్రియ ఉంటుంది. దానిపై రన్నింగ్ కామెంట్రీ చేయలేం. ఇరుపక్షాల వాదనలు వినాల్సి ఉంటుంది. ఆ తరువాత నిర్ణయం తీసుకుంటాం'' అని పేర్కొన్నారు.










