Apr 21,2023 18:58

వెలిగల్లు పార్కును పరిశీలిస్తున్న కలెక్టర్‌ గిరీష

ప్రజాశక్తి-గాలివీడు : వెలిగల్లు ప్రాజెక్టు వద్ద ఆహ్లాదకరమైన వాతావరణం ఉందని, ఇక్కడ పర్యాటక అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్‌ గిరీష ఆదేశించారు. శుక్రవారం మండలంలోని వెలిగల్లు ప్రాజెక్టును కలెక్టర్‌ సందర్శించి ప్రాజెక్టు సామర్థ్యం, ఎంత వాటర్‌ నిల్వ ఉంది, చెరువులకు ఎన్ని క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు, రాయచోటి మున్సిపాలిటీకి ఎంత వాటర్‌ డ్రా చేస్తున్నారు వంటి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టులో నీటి సామర్థ్యం పరిశీలించి, బోటింగ్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు. వెలిగల్లు ప్రాజెక్టు వద్ద టూరిజంను ఏ విధంగా అభివద్ధి చేయవచ్చు వంటి వాటిని కలెక్టర్‌ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రాజెక్టు పై భాగంలో ఉన్న కొండపై గెస్ట్‌ హౌస్‌ ఏర్పాటుకు స్థల పరిశీలన చేశారు. కొండపైకి వెళ్లేందుకు రోడ్డు ఏర్పాటు కోసం పై భాగానికి నడుచుకుంటూ వెళ్లి పరిశీలించారు. పై భాగంలో గెస్ట్‌ హౌస్‌ ఏర్పాటు చేస్తే ప్రాజెక్టు వ్యూ, స్పిల్‌ వే, రివర్‌ మొత్తం బాగా కనబడుతుందని, ఇక్కడ మంచి వాతావరణం ఉందన్నారు. టూరిజం శాఖ ప్రాజెక్టు వద్ద అడ్వెంచర్‌ స్పోర్ట్స్‌ వంటి అభివద్ధి పనులు తదితర వాటిపై ఆ శాఖ అధికారిని కలెక్టర్‌ అడిగి తెలుసుకున్నారు. గెస్ట్‌ హౌస్‌ సమీపంలోనే ఐదు నుంచి పది కాటేజీలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అందులో భాగంగా ప్రాజెక్టు వద్ద పార్కును కలెక్టర్‌ సందర్శించి పార్క్‌ చాలా బాగుందని సంత ప్తి వ్యక్తం చేశారు. పార్కులోనే మంచి స్విమ్మింగ్‌ పూల్‌ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రాజెక్టు వద్ద ఎలాంటి అభివ ద్ధి చేస్తే బాగుంటుందో వాటికి సంబంధించి ప్రణాళికలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. నదిలో చెత్తను వేస్తున్నారని, చెత్తను వేయకుండా చూడాలని, చెత్త వేస్తే ఫైన్‌ వేయడం జరుగుతుందని బోర్డు పెట్టాలని పంచాయతీ కార్యదర్శిని కలెక్టర్‌ ఆదేశించారు. అనంతరం ప్రాజెక్టు వద్ద వెలిసిన ఉమామహేశ్వర స్వామి దేవస్థానంలో కలెక్టర్‌ స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఇరిగేషన్‌ శాఖ జిల్లా అధికారి కృష్ణమూర్తి, జిల్లా పర్యాటక శాఖ అధికారి నాగభూషణం, ఇరిగేషన్‌ శాఖ ఇఇ వెంకటరామయ్య, డిఇఇలు వెంకటేశ్వరరావు, జనార్దన్‌, తహశీల్దార్‌, ఎంపిడిఒ పాల్గొన్నారు.