Aug 03,2022 23:26

ప్రజాశక్తి-విజయవాడ
పూర్ణానందంపేటలోని వెహికల్‌ డిపోలో జరుగుతున్న ఆధునీకరణ పనుల పురోగతిని నగరపాలక సంస్థ కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ బుధవారం పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. డిపోలో నూతనంగా నిర్మించిన మెకానికల్‌ షెడ్‌లో ఫ్లోరింగ్‌ పనులను వెంటనే చేపట్టాలని వెహికల్‌ డిపో ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు. డిపోలోని వాహనాల సర్వీసింగ్‌ చేసే ప్రదేశాన్ని పరిశుభ్రంగా ఉంచాలని కమిషనర్‌ కోరారు. నూతనంగా కొనుగోలు చేసి డిపోలో ఉన్న స్వీపింగ్‌ మిషన్‌ , డ్రెయిన్లను శుభ్రం చేసే నాళ మ్యాన్‌ వాహనాలను వినియోగంలోకి తీసుకురావాలని కమిషనర్‌ ఆదేశించారు. వెహికల్‌ డిపో ప్రహరి గోడకు పెయింటింగ్‌ వేయాలన్నారు. డిపోలోకి ప్రవేశించే ప్రధాన ద్వారం వద్ద ఏవిదమైన వాహనాలను పార్కింగ్‌ చేయరాదన్నారు. అనంతరం ఏలూరు కాలువ వెంబడి ఉన్న గోరా పార్క్‌ను సందర్శించి పార్క్‌ స్థితిగతులు, నిర్వహణ తీరును పరిశీలించారు.ఈ కార్యక్రమంలో ఎస్‌ఇ (వర్క్స్‌) పి.వి.కె భాస్కర్‌ పాల్గొన్నారు.