భారత దేశం గర్వించదగ్గ ఆర్థికవేత్తలలో ఒకరు, నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్‌పై బురద చల్లేందుకు బిజెపి - ఆరెస్సెస్ ఆడుతున్న నాటకం వెగటు పుట్టిస్తోంది. నలుగురూ నవ్విపోతారన్న సిగ్గు కూడా లేకుండా బిజెపి నిరాధారమైన ఆరోపణలతో ఆయనపై దాడికి దిగింది. శాంతి నికేతన్‌కు చెందిన స్థలాలను అక్రమంగా ఆక్రమించిన వారి జాబితాలో అమర్త్యసేన్ పేరును చేర్చుతూ గత వారం విశ్వభారతి యూనివర్సిటీ వైస్ చాన్సలర్ బిద్యుత్ చక్రవర్తితో చేయించిన ప్రకటన ఈ దుష్ట పన్నాగంలో భాగమే. భారత దేశానికి అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులార్జించి పెట్టిన ప్రముఖ ఆర్థికవేత్త, 87 ఏళ్ల ఈ హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ను పట్టుకుని భూ కబ్జాదారుడుగా చిత్రించడంపై విద్యార్థులు, విద్యావేత్తలు, రాజకీయ నాయకులే కాదు, దేశవ్యాపితంగా మేధావులు, ప్రముఖుల నుంచి తీవ్ర నిరసనాగ్రహాలు వ్యక్తమయ్యాయి. అమర్త్య సేన్ గొంతు నొక్కేందుకే కాషాయ శక్తులు ఇటువంటి నీచమైన ప్రచారానికి ఒడిగట్టాయనేది స్పష్టం. మోడీ ప్రభుత్వ విధానాలను బహిరంగంగా విమర్శించడమే ప్రొఫెసర్ చేసిన నేరం అన్నట్లుగా బిజెపి నాయకులు మాట్లాడుతున్నారు. రాజకీయాల ప్రస్తావన చేయకుండా ఉంటే ఇటువంటి వివాదాలు రావు కదా అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఇది వారి ఫాసిస్టు పోకడలకు ప్రతీక. అమర్త్య సేన్ లాంటి ప్రముఖ మేధావిని ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడకూడదో శాసించే హక్కు వీరికెవరిచ్చారు? హిందూాముస్లిం మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టే మతతత్వ శక్తులకు బెంగాల్‌లో చోటివ్వరాదని అమర్త్యసేన్ తరచూ పిలుపునిస్తుంటారు. ఆత్మ నిర్భర్ భారత్ పేరుతో మోడీ ప్రభుత్వం ఆడుతున్న కపట నాటకాన్ని అమర్త్యసేన్ విమర్శించారు. స్వావలంబనకు ఆయువుపట్టుగా ఉన్న నవరత్నాలను, ఈ దేశంలోని అపారమైన సహజవనరులను ఒకవైపు విదేశీ, స్వదేశీ గుత్త పెట్టుబడిదారులపరం చేస్తూ మరో వైపు స్వావలంబన గురించి మాట్లాడడం మోడీ నయవంచనకు నిదర్శనం. మోడీ ప్రభుత్వ దుష్ట విధానాలను విమర్శిస్తే దేశద్రోహులు, జాతి వ్యతిరేకులన్న ముద్ర వేసి జైళ్లలో పెడుతోంది. 2015లో నలంద విశ్వవిద్యాలయం చాన్సలర్ స్థానం నుంచి అమర్త్యసేన్‌ను అవమానకరమైన రీతిలో తొలగించింది. అవినీతి, బంధు ప్రీతికి పాల్పడ్డారంటూ ఆయనపై నిందలు మోపింది. ఇప్పుడు విశ్వభారతి వైస్‌చాన్సలర్ చేసిన ఆరోపణలు కూడా అలాంటివే. ప్రతీచి ట్రస్టు దీర్ఘకాలికంగా లీజుకు తీసుకున్న స్థలంలోనే ఉందనడానికి అవసరమైన లీజు డాక్యుమెంట్లు తన వద్ద ఉన్నాయని, లీజు గడువు ఇంకా చాలా కాలం ఉందని అమర్య్తసేన్ స్పష్టం చేసిన తరువాత కూడా బిజెపి ఈ తప్పుడు ప్రచారాన్ని అదే పనిగా కొనసాగించడంలో ఆంతర్యం తెలియనిదేమీ కాదు. వచ్చే ఏప్రిల్ - మే నెలలో జరిగే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకోవాలంటే బెంగాల్ లౌకిక సంస్కృతిని మొదట ధ్వంసం చేయాలి.ఆ సంస్కృతికి ప్రతీకగా ఉన్న వ్యక్తులను, శక్తులను దెబ్బతీయాలి. ఇదీ బిజెపి కుటిల పన్నాగం. రవీంద్ర నాథ్ టాగూర్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, స్వామి వివేకానంద వంటి మహాపురుషులంతా లౌకిక బెంగాలీ సంస్కృతిని పెంపొందించేందుకు కృషి చేశారు. మమత బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ అవకాశవాదంతో బిజెపితో గతంలో పొత్తు పెట్టుకుంది. ఫలితంగా బెంగాల్‌లో హిందూత్వ శక్తులు వేళ్లూనుకునేందుకు అవకాశమిచ్చింది. ఇప్పుడు అవే శక్తులు లౌకిక సంస్కృతిపై బాహాటంగా దాడికి దిగుతున్నాయి. గత లోక్‌సభ ఎన్నికల్లో బెంగాల్‌లో 18 లోక్‌సభ స్థానాలు తన ఖాతాలో పడడంతో బిజెపి కన్ను మిన్ను కానకుండా వ్యవహరిస్తోంది. సత్యం ఎప్పుడూ మతతత్వ శక్తులకు వ్యతిరేకంగానే ఉంటుంది. అందులోనూ నిత్యం అసత్యాలతో బతికే బిజెపి, ఆరెస్సెస్ వంటి ఫాసిస్టు శక్తులకు సత్యం అంటేనే గిట్టదు. అందుకే సత్యాన్ని సమాధి చేయాలని అవి నిరంతరం ప్రయత్నిస్తుంటాయి. అటువంటి శక్తులను బెంగాల్ ప్రజలు నిర్ద్వంద్వంగా తిరస్కరించాలి. తమ లౌకిక వారసత్వ సంపదను పదిలంగా కాపాడుకోవాలి. వామపక్ష సంఘటనను బెంగాల్‌లోని లౌకిక శక్తులన్నీ బలపరచడమే మతతత్వ శక్తుల దాష్టీకాన్ని నిలువరించగల మార్గం.










