Feb 25,2022 08:20
  • 600 మంది వాటర్‌షెడ్‌ ఉద్యోగులను పట్టించుకోని ప్రభుత్వం

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : వర్షాభావం తక్కువ ఉండే కరువు ప్రాంతాల్లో పరుగెత్తే నీటిని నడిచేటట్లు, నడిచే నీటిని భూమిలో ఇంకించి తద్వారా భూగర్భ జలాలను పెంచే లక్ష్యంతో చేపట్టిన వాటర్‌షెడ్‌ పథకంలో పనిచేసే ఉద్యోగులు ఇప్పుడు ఆరు నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పొలాల్లో మట్టి కోతకు గురికాకుండా రాతికట్టడాలు, చెక్‌డ్యామ్‌లను, నీటి నిల్వకుంటలను, ఇంకుడు గుంతలు, కొండ ప్రాంతాల్లో కందకాలు తవ్వకం లాంటి పనులను వాటర్‌షెడ్‌ పథకం కింద చేస్తారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎన్‌ఆర్‌ఇజిఎస్‌)లో ఈ పథకాన్ని విలీనం చేసి అక్కడ పనిచేస్తున్న సిబ్బందినే వాటర్‌షెడ్‌ ప్రాజెక్టులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు గడువు ముగిసిందని వాటర్‌షెడ్‌లలో క్షేత్రస్థాయిలో కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న సమీకృత నీటి యాజమాన్య సిబ్బంది (ఐడబ్ల్యుఎంపి)కి వేతనాలు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా)లో వాటర్‌షెడ్‌ స్టాఫ్‌గా పరిగణించే వీరికి గతేడాది అక్టోబరు నెల నుంచి వేతనాలు అందడం లేదు. ఉన్నతాధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా ఫలితం లేదు. రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనరేట్‌లోనూ ఉన్నతాధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా తమ సమస్యను పట్టించుకునే నాథుడు లేరని వాటర్‌షెడ్‌ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వాటర్‌షెడ్‌ ప్రాజెక్టులో ఎపిఒలుగా 71 మంది, జెఇలుగా 70 మంది, సిఒలుగా 85 మంది, టిఎ (ఐ అండ్‌ డబ్ల్యు)గా 60 మంది, టిఎలుగా 314 మంది మొత్తం 600 మంది పనిచేస్తున్నారు. వేతనాలు నిలిచిపోవడంతో ఫీల్డ్‌ పరిశీలనకు వెళ్లినప్పుడు ప్రయాణ ఖర్చుల కోసం అష్టకష్టాలు పడుతున్నారు. కాంట్రాక్టు పద్ధతిలో పనిచేసే వీరికి వచ్చేది తక్కువ వేతనమైనా అది కూడా ఆరు నెలలుగా ఇవ్వడం లేదు. వాటర్‌షెడ్‌ ప్రాజెక్టు ముగిసినందున ప్రభుత్వం తమను ఎన్‌ఆర్‌ఇజిఎస్‌లో రెన్యువల్‌ చేసి వేతనాలు వెంటనే మంజూరు చేయాలని కోరుతున్నారు.