చిలమత్తూరు : గ్రామపంచాయతీ స్వచ్ఛభారత్ కార్మికులకు పెండింగ్ వేతనాలు, సబ్సు, నూనె, చెప్పులు, గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో స్థానిక ఎంపిడిఒ కార్యాలయం వద్ద శనివారం నిరసన వ్యక్తం చేశారు. చిలమత్తూరు ఎంపీడీవో కార్యాలయం ముందర పచ్చగడ్డి తింటూ వినూత్న నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఇఒఆర్‌డి శకుంతలమ్మకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా సిఐటియు జిల్లా నాయకులు రమేష్, ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ చిలమత్తూరు మండలంలో గ్రామ పంచాయతీ స్వచ్చ భారత్ కార్మికులు దాదాపు 80 మంది ఉన్నారన్నారు. స్వచ్చ భారత్ కార్మికులు 12 నెలల నుండి వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. గ్రామాన్ని శుభ్రంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తున్న కార్మికులకు వేతనాలు ఇవ్వకపోవటం దారుణమన్నారు. వేతనాలు రాక వారి కుటుంబసభ్యులు పస్తులు ఉండాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.










