Nov 22,2022 21:17

కలెక్టరేట్‌ వద్ద ధర్నాలో ప్రసంగిస్తున్న మాజీ ఎమ్మెల్సీ డా||గేయానంద్‌

           అనంతపురం కలెక్టరేట్‌ : ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు హక్కులు, సౌకర్యాలు అమలు చేయాలని కోరే పరిస్థితి నుంచి చేసిన పనికి నెలవారీ వేతనాలు సకాలంలో ఇస్తే చాలన్న దుస్థితికి ప్రభుత్వ పాలకులు తీసుకొచ్చారని మాజీ ఎమ్మెల్సీ డాక్టర్‌ గేయానంద్‌, సిఐటియు రాష్ట్ర నాయకులు జి.ఓబులు పేర్కొన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల ధీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (యుటిఎఫ్‌) అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల కమిటీల ఆధ్వర్యంలో మంగళవారం నాడు అనంతపురం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు గోవిందరాజులు అధ్యక్షతన నిర్వహించిన ధర్నాకు ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ డాక్టర్‌ గేయానంద్‌ హాజరై మాట్లాడారు. ఉద్యోగులు పిఎఫ్‌ కోసం దరఖాస్తు చేసుకుని నెలల తరబడి కావస్తున్న డబ్బులు చేతికందని దుస్థితి రాష్ట్రంలో లేదన్నారు. సమస్యలు పరిష్కరించాలని గొంతెత్తితే పోలీసులతో అక్రమ అరెస్టులు, నిర్బంధాలకు ప్రభుత్వం గురి చేయడం అన్యాయంగా ఉందన్నారు. సిఐటియు రాష్ట్ర నాయకులు జి.ఓబులు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడిదారీ, పెత్తందారీ విధానాలు అనుసరిస్తూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని తెలిపారు. కేవలం కార్పొరేట్‌ కంపెనీలే లాభపడుతున్నాయని దుయ్యబట్టారు. మోదీ ప్రభుత్వం రాష్ట్రం పట్ల వివక్ష చూపుతోందన్నారు. దాన్నీ వ్యతిరేకించి ప్రజలను కలుపుకుని పోరాడాల్సిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మోదీకి మొకరిల్లుతూ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని విమర్శించారు. ప్రశ్నించేందుకు అధికార, ప్రతిపక్షాలు మోదీ దాసోహంగా వ్యవహరించడం సిగ్గుచేటుగా ఉందన్నారు. యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి కోటేశ్వరప్ప మాట్లాడుతూ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం స్పందన బట్టి భవిష్యత్‌ పోరాటాలు చేపడతామన్నారు. యుటిఎఫ్‌ జిల్లా గౌరవాధ్యక్షులు రమణయ్య మాట్లాడుతూ పోరాటాల నేపథ్యంలో యుటిఎఫ్‌ నాయకులు, కార్యకర్తలపై ప్రభుత్వం కేసులు, నోటీసులు జారీ చేసి ఆందోళనలో నెట్టి వేయాలని చూడడం సరికాదన్నారు. యుటిఎఫ్‌ అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లా ప్రధాన కార్యదర్శులు లింగమయ్య, కె.నాగేంద్ర మాట్లాడుతూ శాసనసభలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుందని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చెబుతూనే ఉద్యోగులు వారి వేతనాల్లోంచి దాచుకున్న సొమ్మును ఇవ్వకుండా కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం ఏమిటని నిలదీశారు. సిపిఎస్‌ రద్దు చేస్తామని, జిపిఎస్‌ తీసుకురావడం కార్పొరేట్‌ కంపెనీలకు దాసోహం చేయడమే అవుతుందన్నారు. ఈ విధానాలపై ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్‌లు, ప్రజా సంఘాల మద్దతును కూడకట్టుకుని ఉద్యమాలు చేపడతామన్నారు. ఈ ధర్నాకు పశ్చిమ రాయలసీమ పట్టభధ్రుల పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి పోతుల నాగరాజు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్‌ జిల్లా సహాధ్యక్షులు రామప్పచౌదరి, రెండు జిల్లాల కోశాధికారులు రాఘవేంద్ర, సుధాకర్‌, జిల్లా గౌరవ అధ్యక్షులు భూతన్న, జిల్లా కార్యదర్శులు నారాయణస్వామి, శ్రీనివాసులు, తాహీర్‌వలి, హరిక్రిష్ణ, హనుమంతరెడ్డి, అర్జున్‌, రఘురామయ్య, రవికుమార్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.