రొళ్ల : వేకువజామున కూలీల ఇంట విషాద ఘటన చోటు చేసుకుంది. సొంత పనుల నిమిత్తం ఎద్దుల బండిలో బయటకు వెల్లిన వారు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఎద్దుల బండిలో వస్తున్న వీరిని వెనుక వైపు నుంచి ఐచర్ వాహనం వేగంగా వచ్చి ఢకొీంది. ఈ ప్రమాదంలో ఎద్దుల బండిలో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. వీరితో పాటు ఒక ఆవు కూడా మరణించింది. స్థానికులు, పోలీసులు తెలిపిన మేరకు ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి... అగిళి మండలం నరసాంబూది పంచాయతీ కసాపురం గ్రామానికి చెందిన గోవిందప్ప(37), తిన్నేగౌడా(41), శివన్నలు శనివారం ఉదయం ఎద్దుల బండిలో పొలం వద్దకెళ్లారు. అక్కడ పనులు ముగించుకుని రామన్నపల్లి నుంచి అగళి మీదుగా గ్రామానికి బయళ్దేరారు. ఎద్దుల బండి అగళి హైవే వద్దకు రాగానే రొళ్ల నుంచి కర్నాటక వైపు వెళ్తున్న ఎపి39 టివి4235 ఐచర్ వాహనం వెనుక వైపు నుంచి వేగంగా వచ్చి ఢకొీంది. దీంతో ఎద్దుల బండి పల్టీలు కొడుతూ రోడ్డు పక్కకు పడిపోయింది. ఈ ప్రమాదంలో గోవిందప్ప, తిన్నేగౌడలు తీవ్ర గాయాలతో ఘటనా స్థలంలోనే మృతి చెందారు. ఇదే బండిలో ఉన్న ఎంపిటిసి గోవిందప్ప సోదరుడు శివన్న తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాద ధాటికి ఓ ఆవు మృతి చెందింది. మరో ఆవు తీవ్రంగా గాయపడింది. ఘటనకు కారణమైన డ్రైవర్ ఐచర్ వాహనాన్ని రోడ్డుపై వదిలి పారిపోయాడు. ప్రమాద విషయం తెలియగానే సిఐ సురేష్‌బాబు, ఎస్‌ఐ లావణ్య సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే క్షతగాత్రున్ని చికిత్స నిమిత్తం 108లో హిందూపురం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మతుల కుటుంబానికి జెడ్పీటీసీ రూ.పదివేల సాయం
ప్రమాద విషయం తెలుసుకున్న అగళి జెడ్పీటీసీ ఉమేష్ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతుల కుటుంబ సభ్యులకు తనవంతుగా ఒక్కొక్కరికి రూ.10 వేల తక్షణ సాయం అందించారు. ఇటీవల అగళి హైవే రోడ్డుపై ప్రమాదాలు అధికం అయ్యాయని, వీటి నివారణకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.










