మదనపల్లె అర్బన్ : జగనన్న లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని కలెక్టర్ గిరీష సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం మదనపల్లె సబ్ కలెక్టర్ ఛాంబర్‌లో మదనపల్లె ఎమ్మెల్యే నవాజ్ బాషాతో కలిసి ఇళ్ల నిర్మాణాల పురోగతిపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న జగనన్న హౌసింగ్ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని తెలిపారు. ఇళ్ల నిర్మాణాలలో నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. నిర్మాణాలకు సంబంధించి రోజురోజుకు పురోగతి కనిపించే విధంగా ప్రతి అధికారి చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. లే అవుట్‌లలో ముఖ్యంగా విద్యుత్, నీటి సౌకర్యం కల్పించాలన్నారు. మదనపల్లె నియోజకవర్గంలోని మదనపల్లె, రామసముద్రం, నిమ్మనపల్లె మండలాలలో 73 లేఔట్లు ఉన్నాయన్నారు. ఈ లేఔట్‌లలో 7,777 ఇళ్లు మంజూరు కాగా 1073 ఇళ్లు పూర్తయ్యాయని ఇంకా145 ఇల్ల నిర్మాణాలు ప్రారంభించాల్సి ఉందన్నారు. ఇంకా ప్రారంభంకాని ఇళ్లన్నీ సత్వరమే ప్రారంభించి పునాది స్థాయికి తీసుకురావాలన్నారు. నియోజకవర్గంలో 10 లేమవుట్లలో వాటర్ సప్లై లేదని 15 రోజులు లోపల నీటి సదుపాయం కల్పించాలన్నారు. మే 5వ తేదీ నాటికి అన్ని లే అవుట్‌లలో కరెంటు సదుపాయం కల్పించాలన్నారు. పట్టణ ప్రాంత పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం టిడ్కో ఇళ్లను మంజూరు చేశామన్నారు. పెండింగ్‌లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయించాలని అధికారులను ఆదేశించారు. టిడ్కోలో రోడ్డు, డ్రెయినేజీ, విద్యుత్తు, నీటి సౌకర్యం వంటి మౌలిక వసతులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. ఇళ్ల నిర్మాణాలను ప్రతి ఒక్కరూ సీరిరుసగా తీసుకుని లేఅవుట్ వారీగా ఇచ్చిన లక్ష్యాలను అధిగమించాలని అధికారులను ఆదేశించారు. మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ భాష మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు విశేష కృషి చేస్తున్నారని తెలిపారు. కొన్ని మండలాల్లో అనుకున్న స్థాయిలో ఇళ్ల నిర్మాణాలు జరగడంలేదని, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఇళ్ల నిర్మాణాల్లో పురోగతి కనిపించే విధంగా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో మదనపల్లి సబ్ కలెక్టర్ మురళి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సతీష్ కుమార్, ట్రాన్స్‌కో ఇఇ రాజశేఖర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ప్రమీల, హౌసింగ్ అధికారులు పాల్గొన్నారు.
- 4 సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ గిరీష










