May 11,2023 21:07

- సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ గిరీష

రాయచోటి: జిల్లాలోని ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన భూసేకరణ వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ గిరీష సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని మినీ వీడియో కాన్ఫరెన్స్‌ హోల్లో జిల్లాలో చేపట్టిన గాలివీడు, సంబేపల్లి, ముదివేడు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీములు, మదనపల్లి హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్‌-1, ములకలచెరువు-మదనపల్లి ఎన్‌హెచ్‌-42లకు భూ సేకరణ అంశంపై సంబంధిత తహశీల్దార్లు, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లు, ఆర్‌డిఒలు, ఇరిగేషన్‌, ఆర్‌అండ్‌బి అధికారులతో కలెక్టర్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన లిఫ్ట్‌ స్కీములను త్వరితగతిన పూర్తి చేయడం వల్ల జిల్లా ప్రజలకు సాగు, తాగునీరు సమస్యలు తొలుగుతాయన్నారు. ఆయా పథకాలకు సంబంధించి పెండింగ్‌ పనులు, ప్రక్రియలను త్వరగా పూర్తి చేయాలన్నారు. వెలిగల్లు-గాలివీడు ఎత్తిపోతల పథకానికి పట్టా, డికెటి, ప్రభుత్వ భూమి 39.29 ఎకరాలు సేకరించాల్సి ఉందన్నారు. సంబంధిత రైతులతో మాట్లాడి భూమి ధరను నిర్ణయించి వీలైనంత త్వరగా భూసేకరణ చేయాలని చెప్పారు. ఝరికోన ప్రాజెక్టు ద్వారా రాయచోటి నియోజకవర్గంలోని చెరువులకు ఎత్తిపోతల ద్వారా నీటిని నింపడం ప్రధాన ఉద్దేశమన్నారు. ఇందుకు 26.29 ఎకరాల భూమి అవసరం అవుతుందని తెలిపారు. ఇప్పటికే సేకరించిన భూమికి రెండు రోజుల్లోగా అవార్డ్స్‌ పాస్‌ చేసి వెంటనే పరిహారం చెల్లించాలని సూచించారు. ముదివేడు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌కు సేకరించిన 446.5 ఎకరాలకు ప్రభుత్వం మంజూరు చేసిన రూ.54 కోట్లు పరిహారం త్వరితగతిన రైతులకు చెల్లించాలని ఈ మేరకు చర్యలు తీసుకోవాలని సంబంధిత ఆర్‌డిఒ, ఎస్‌డిసి, తహశీల్దార్లను ఆదేశించారు. మదనపల్లి హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్‌-1 పంపు హౌస్‌ పైప్‌ లైన్‌ ఏర్పాటుకు సోంపల్లి, కదిరినాధునికోట, మారెళ్ళగడ్డలకు వచ్చే వారానికి ప్రాథమిక ప్రకటన జారీ చేయాలని హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ను ఆదేశించారు. మొలకలచెరువు, ఎన్‌హెచ్‌-42కు సంబంధించి అవార్డ్స్‌ పాస్‌ చేశామన్నారు. సంబంధితలకు పరిహారం త్వరగా చెల్లించి ఆర్‌అండ్‌బికి భూమిని అప్పగించాలని సంబంధిత తహశీల్దార్‌ను ఆదేశించారు. రెవెన్యూ శాఖ నుంచి భూమి అప్పగించగానే వెంటనే పనులు మెదలు పెట్టాలని ఆర్‌అండ్‌బి అధికారులకు సూచించారు. జిల్లాలోని ఎత్తిపోతల పథకాలు, ఎన్‌హెచ్‌-42కు భూసేకరణ చేయడంలోగల వివిధ ప్రక్రియలను సంబంధిత శాఖలన్నీ భాగస్వామ్యం వహించి సమన్వయంతో త్వరగా పూర్తి చేయాలని పేర్కొన్నారు. సమీక్ష సమావేశంలో డిఆరఒ సత్యనారాయణ, రాయచోటి, మదనపల్లి ఆర్‌డిఒలు రంగస్వామి, మురళి, పీలేరు, మదనపల్లి ఎస్‌డిసిలు, సంబంధిత తహశీల్దార్లు, ఇరిగేషన్‌, ఆర్‌అండ్‌బి శాఖల అధికారులు పాల్గొన్నారు.