రాయచోటి: జిల్లాలో ఎన్‌సిడిసిడి సర్వే లక్ష్యాన్ని వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ గిరీష వైద్యాధి కారులను ఆదేశించారు. సోమవారం రాయచోటి కలెక్టరేట్ మినీ వీడియో కాన్ఫరెన్స్ హాలు నుంచి ఎన్‌సిడిసిడి సర్వే, అనీమియా నివారణ, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తదితర అంశాలపై వైద్యాధికారులు, ఎఎన్‌ఎంలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో దాదాపు 16 లక్షల మందికి సంబంధించి ఎన్‌సిడిసిడి సర్వే చేయాల్సి ఉందని ఇందులో ఇప్పటివరకు 12 లక్షల మందికి సర్వే పూర్తి చేశారన్నారు. మిగిలిన లక్ష్యాన్ని ఎఎన్‌ఎం, ఆశా, వైద్యాధికారి సమన్వయంతో త్వరితగతిన ఎన్‌సిడిసిడి సర్వే పూర్తి చేయాలన్నారు. గతవారం ప్రగతిలో వెనుకబడి ఉన్న కోనంపేట, సాకిబండ, శెట్టిగుంట, టి.సుండుపల్లె, వీరబల్లి తదితర కొన్ని పిహెచ్సీల ప్రగతిపై సమీక్షించి త్వరగా లక్ష్యాలను సాధించాలని సంబంధిత పిహెచ్‌సి వైద్యాధికారి, ఆశా, ఎఎన్‌ఎంలకు సూచించారు. సర్వే చేయడం మరియు ప్రగతి సాధనలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్‌సిడిసిడి సర్వే కొరకు ప్రతి ఎఎన్‌ఎం పరిధిలో అన్ని సచివాలయాల్లో ఉన్న వాలంటీర్లు అందరూ మ్యాప్ అయ్యారా లేదా అని పరిశీలించి మున్సిపల్ కమిషనరుతో సంప్రదించి వారిని మ్యాపింగ్ చేయించాలని మెడికల్ అధికారులను ఆదేశించారు. గ్యారంపల్లి, దేవలంపల్లి, రాచపల్లిలలో ప్రగతిలో వెనుకబడుతున్నారని.. అక్కడ క్షేత్రస్థాయిలో పర్యటించి సరిగా పనిచేయని ఎఎన్‌ఎంలను సస్పెండ్ చేయాలని డిఎంహెచ్‌ఒకు సూచించారు. హైపర్ టెన్షన్ సస్పెక్టెడ్ కేసులు 6853 పెండింగ్ లో ఉన్నాయని నాలుగైదు రోజులలో పెండింగ్ కేసుల పరీక్షలు పూర్తి చేయాలన్నారు. కోనంపేట, సాకిబండ, దేవలంపల్లి, పెద్దమండ్యం పిహెచ్సి పరిధిలో డయాబెటిస్ కేసుల పరీక్షలు త్వరగా పూర్తి చేయాలన్నారు. జిల్లాలో 5600 యాంటినెంటల్ కేసెస్ ఉండగా... 60 శాతం పరీక్షలు పూర్తి చేశారని ఈనెలాఖరులోపు మిగతా 40శాతం పూర్తిచేయాలని చెప్పారు. పిహెచ్‌సిలలో జనరల్ ఓపీ కేసుల పరీక్షలు పెరగాల్సి ఉందన్నారు. ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని జిల్లాలో పటిష్టంగా అమలు చేయాలని పేర్కొన్నారు. ప్రతి సచివాలయానికి హిమోగ్లోబిన్ టెస్టింగ్ కిట్టు సరఫరా జిల్లాలో తీవ్ర రక్తహీనత రక్తహీనతతో బాధపడుతున్న వారికి ప్రత్యేక దష్టితో చికిత్సను అందజేయాలని కలెక్టర్ వైద్యాధికారులను ఆదేశించారు. ఇందుకు ప్రతి సచివాలయం పరిధికి హిమోగ్లోబిన్ టెస్టింగ్ కిట్లను సరఫరా చేస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. టెస్టింగ్ కిట్ల ద్వారా హిమోగ్లోబిన్ శాతం కనుగొనడానికి ఏ విధంగా పరీక్ష చేయాలో అందరికీ ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించాలని డిఎంహెచ్‌ఓకు సూచించారు. ఈ సందఠంగా ఆరోగ్య మిత్ర కార్యకర్తలకు హిమోగ్లోబిన్ టెస్టింగ్ కిట్లను సమావేశంలో కలెక్టర్ అందజేశారు. సమీక్ష సమావేశంలో డిఎంహెచ్‌ఒ డాక్టర్ కొండయ్య, చైల్డ్ హెల్త్ ప్రోగ్రాం ఆఫీసర్, ఎన్సిడి జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ శేషగిరి బాబు, వైద్య ఆరోగ్యశాఖ డాక్టర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.










