May 03,2023 21:31

ఫొటో : మాట్లాడుతున్న ఎంఎల్‌ఎ ఆనం రామనారాయణరెడ్డి

వేగంగా మారుతున్న రాష్ట్ర రాజకీయాలు : ఆనం
ప్రజాశక్తి-మర్రిపాడు : రాష్ట్ర రాజకీయాలు వేగంగా మారుతున్నాయని మాజీ మంత్రి, వెంకటగిరి ఎంఎల్‌ఎ ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం మండల నాయకులతో సమావేశమయ్యారు. ఆయన బద్వేల్‌ నుండి నెల్లూరు వెళ్తూ శాఖామూరి నారాయణ గెస్ట్‌హౌస్‌ వద్ద గతంలో ఆయనతో కలసి పనులు సాధించిన నాయకులతో కలసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు ఆనంను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయాలు మన ఆలోచనలకు అందనంత వేగంగా మారుతున్నాయన్నారు.
దాదాపు 4 సంవత్సరాల రాజకీయంలో వైసిపి ప్రభుత్వం మనుగడ సుస్థిరం అవుతుందని మొదట అందరం భావించామని, రానురాను ప్రభుత్వ పెద్దలు తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రభుత్వ మనుగడ 10మాసాలలో ప్రశ్నార్థకంగా మారిందన్నారు. వేగంగా మార్పులు చోటు చేసుకోవడం ఎవరూ ఊహించలేదని తెలిపారు. ప్రభుత్వ పెద్దల్లో గానీ, సలహాదారుల్లో గానీ కించెత్తు మార్పు రాకపోగా ఎవరు ఏం అనుకున్న తమకేమి అనే ధోరణితో వ్యవహరిస్తున్నారన్నారు. ఏకపక్ష ధోరణిలో ప్రజాస్వామ్యం నడుస్తుందని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ఉండే నిబద్ధత విధానాలు లేవన్నారు. ఒంటెద్దు పొగడ్తలతో అంతా తానే అనే ధోరణి తప్ప భారతదేశ రాజ్యాంగంలో ఉన్న సమైక్య స్ఫూర్తి అందరి ఆలోచనలతో ముందుకు నడవాల్సిన పరిస్థితి ప్రస్తుత ప్రభుత్వంలో కనిపించడం లేదన్నారు. రాబోయే రోజుల్లో మున్ముందు అందరూ నాయకులు కార్యకర్తలు కలిసే సందర్భాలు ఉన్నాయన్నారు. ఆయనవెంట నాయకులు శాఖమూరి నారాయణ, రాటకొండ లక్ష్మయ్య, ఎరుకులయ్య, హజరత్‌ బాబు తదితరులు ఉన్నారు.