రైతు రుణాల కలెక్షన్స్ ముమ్మరం
సున్నా వడ్డీ ప్రశ్నార్ధకం
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధిా అమరావతి
రైతుల నుండి వడ్డీతో సహా పంట రుణాల వసూళ్లను బ్యాంకులు ముమ్మరం చేశాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వడ్డీ రాయితీ ఎప్పటికో విడుదలవుతోన్న దృష్ట్యా బ్యాంకులు అన్నదాతల నుండి వడ్డీ, అసలు రెండూ కలిపి ఒకేసారి పిండుతున్నాయి. 'అసలు' చెల్లించలేని వారి నుండి వడ్డీ మాత్రం తీసుకొని కొత్త రుణాల కింద పునరుద్ధరణ (రెన్యువల్) చేస్తున్నాయి. లక్ష రూపాయలకు మొత్తం ఏడు శాతం వడ్డీ రూ.ఏడు వేలనూ నోటీసులిచ్చి, బ్యాంకులకు రప్పించి కట్టించుకుంటున్నాయి. పునుపటి రబీలో తీసుకున్న రుణాలకు ఏడాది కాలపరిమితి ముగియడంతో రెన్యువల్స్ కోసం బ్యాంకులు రైతులను వడ్డీ కోసం పీడిస్తున్నాయి. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వరంగంలోని సహకార బ్యాంకులు ముందున్నాయి. విపత్తులు, పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేమితో సతమతమవుతున్న రైతాంగానికి రెండేళ్లుగా కరోనా కష్టాలు తోడయ్యాయి. త్వరలో మొదలవుతున్న ఖరీఫ్ పెట్టుబడుల కోసం వెతుక్కుంటున్న రైతులు, పాత బకాయిలపై వడ్డీ సైతం కట్టాల్సి రావడంతో ఆందోళన చెందుతున్నారు.
జీరో ఇంట్రస్ట్ సంగతేంటి?
పంట రుణాలపై బ్యాంకులు ఏడు శాతం వడ్డీ విధిస్తుండగా, సకాలంలో చెల్లించిన లోన్లపై కేంద్రం మూడు శాతం, రాష్ట్రం నాలుగు శాతం వడ్డీ భరిస్తామన్నందున, తుదకు సున్నా వడ్డీ అంటున్నారు. వైసిపి ఎన్నికల మేనిఫెస్టోలో రైతులు 'అసలు' చెల్లిస్తే సరిపోతుంది, వడ్డీ సంగతి ప్రభుత్వమే చూసుకుంటుందన్నారు. ఆచరణలోకొచ్చేసరికి రైతులు ముందు వడ్డీ చెల్లిస్తే తనంతరం వారి బ్యాంక్ ఖాతాలకు నేరుగా రీయింబర్స్ చేస్తామన్నారు. అయితే గడువు లోపు, ఇాక్రాప్ బుకింగ్ వంటి షరతులు పెట్టడంతో చాలా స్వల్ప సంఖ్యలోనే రైతులకు సున్నా వడ్డీ రీయింబర్స్‌మెంట్ జరుగుతోంది. అదీ ఆలస్యంగా జమ చేస్తున్నారు. కౌలు రైతులకు ఇచ్చే అప్పులు తక్కువ కాగా నిబంధనల మూలంగా ఆ కొద్ది మందికి సైతం సున్నా వడ్డీ పడట్లేదు.
రీయింబర్స్ ఎప్పుడో...
వైసిపి ప్రభుత్వం వచ్చాక 2019 ఖరీఫ్, 2019ా20 రబీ, 2020 ఖరీఫ్ సీజన్లకు ప్రభుత్వం సున్నావడ్డీ క్లెయిములు వేసింది. సీజన్ సీజన్‌కీ లబ్ధిదారుల సంఖ్య, రీయింబర్స్ అమౌంట్ తగ్గుతూ వచ్చాయి. 2020ా21 రబీ క్లెయిములకు సర్కారు నిధులివ్వాల్సి ఉంది. నిధుల లభ్యత బట్టి మే నెలలో సెటిల్ చేస్తారని చెబుతున్నారు. కాగా ఆ సీజన్‌లో బ్యాంకులు రూ.51 వేల కోట్ల వరకు పంట రుణాలివ్వగా వాటిలో రూ.లక్ష లోపు లోన్లు రూ.35 వేల కోట్ల వరకు ఉండొచ్చని అంచనా. ఆ మొత్తానికీ సర్కారు తన వాటా 4 శాతం వడ్డీ రీయింబర్స్ చేయాలంటే కనీసం రూ.1,400 కోట్లు కావాలి. ఏ మేరకు రీయింబర్స్ చేస్తారో ఇప్పటికైతే స్పష్టత లేదంటున్నారు.










