న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఎదురు చూస్తున్నారా..అయితే ఇది మీ కోసమే..వచ్చే ఏడాది ప్రారంభంలో కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్(సెట్)ను దేశ వ్యాప్తంగా నిర్వహించనున్నట్టు కేంద్ర సిబ్బంది వ్యవహారాల సహాయ మంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు. ఐఎఎస్ అధికారుల సివిల్ లిస్ట్-2021 ఇ-పుస్తకాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ...కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో నియామకాల కోసం అభ్యర్థులను పరీక్షించి, తుది జాబితా రూపొందించడానికి ఉద్దేశించిన ఈ పరీక్ష ఈ ఏడాది చివరినాటికే జరగాల్సి ఉండగా ...కరోనా కారణంగా ఆలస్యమైందని తెలిపారు. ఇప్పటి వరకు స్టేఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్‌ఎస్‌సి), రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు(ఆర్‌ఆర్‌బి), ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబిపిఎస్) ద్వారా ప్రభుత్వరంగంలో ఉద్యోగాల భర్తీ చేపడుతున్నారని అన్నారు.. గ్రూప్-బి, సి పోస్టులకు కూడా నేషనల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ (ఎన్‌ఆర్‌ఎ) పరీక్ష నిర్వహిస్తుంది. ఈ పరీక్ష నిర్వహణకు దేశంలోని ప్రతి జిల్లాలో కనీసం ఒక్క కేంద్రమైనా ఉండేలా చర్యలు తీసుకుంటారు. దీంతో మారుమూల ప్రాంతాల్లో వుండే అభ్యర్థులకు అవకాశాలు లభిస్తాయి.










