Sep 26,2023 20:55

వైసిపి జెండా

ప్రజాశక్తి-నెల్లూరు ప్రతినిధి :వైసిపిలో టికెట్స్‌ టెన్షన్‌ మొదలైంది. 2024 ఎన్నికల్లో గెలిచే అభ్యర్థులకే టికెట్‌ ఇస్తామని ముఖ్యమంత్రి, వైసిపి అధినేత జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం తాడేపల్లిలో జరిగిన ఆపార్టీ నేతల సమావేశంలో ప్రస్తుతం సిట్టింగ్‌ ఎంఎల్‌ఎలకు 60 మందికి టికెట్‌ ఇవ్వడం లేదని చెప్పినట్లు తెలిసింది. ఈ పరిణామాలతో జిల్లాలోని ముగ్గురు నేతలు ఆ జాబితాలో ఉన్నారని తెలుస్తోంది. ఇప్పటికే ముగ్గురు ఎంఎల్‌ఎలు వైసిపి నుంచి టిడిపిలో చేరారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని మూడు నియోజకవర్గాలు నెల్లూరు సిటి, గూడూరు, కావలి ఎంఎల్‌ఎల పనితీరు బాగాలేదని నివేదిక ఇచ్చినట్లు సమాచారం.
2024 ఎన్నికలకు అధికార వైసిపి సిద్ధమవుతోంది. రానున్న ఎన్నికల్లో సిట్టింగ్‌ ఎంఎల్‌ఎలకు టికెట్స్‌ వచ్చే అవకాశం లేదని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. మంగళవారం తాడేపల్లిలో ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు, నియోజవర్గ ఇన్‌ఛార్జ్‌లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఇప్పటికే పికె.టీమ్‌తోపాటు ఇంటిలిజెన్స్‌, ఎస్‌బి,తోపాటు మరికొన్ని నివేదికలను ముఖ్యమంత్రి వద్దకు చేరినట్లు తెలిసింది. ఇంటింటికి మన ప్రభుత్వం, కార్యక్రమంలో ఎవరు ఎలా పనిచేశారు. ప్రజల్లో ఎలాంటి పేరు ఉంది. అనే అంశాలను పరిగణంలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఎప్పటి నుంచో చెబుతున్నారు. ఇదే విషయాన్ని సిఎం స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ఎవరికి సీట్లు వస్తాయి, రావు అనే విషయంపై అటు వైసిపి నేతల్లోనూ, ఇటు ప్రజల్లోనూ తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇప్పటికే ముగ్గురు వైసిపి ఎంఎల్‌ఎలు పార్టీని వీడారు. వెంకటగిరి, ఉదయగిరి, నెల్లూరు రూరల్‌ ఎంఎల్‌ఎలు ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంధ్రశేఖర్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పార్టీని వీడి టిడిపిలో చేరారు. అక్కడ ఇన్‌ఛార్జ్‌లను నియమించారు. వెంకటగిరి నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి, మేకపాటి రాజారెడ్డి, ఆదాల ప్రభాకర్‌రెడ్డిని నియమించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సిఎం వద్ద ఉన్న నివేదిక ప్రకారం జిల్లాలో ముగ్గురు సిట్టింగ్‌లకు టికెట్‌ ఇవ్వరని తెలుస్తోంది. ఇద్దరు ఇన్‌ఛార్జ్‌లకు అవకాశం లేనట్లు ప్రచారం సాగుతోంది.
ముగ్గురు అభ్యర్థులకు అనుమానమే..!
సిఎం జగన్‌మోహన్‌రెడ్డి వద్ద ఉన్న నివేదిక ప్రకారం ముగ్గురు సిట్టింగ్‌ ఎంఎల్‌ఎల పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. నెల్లూరు సిటి ఎంఎల్‌ఎ పి. అనిల్‌కుమార్‌యాదవ్‌, కావలి ఎంఎల్‌ఎ రామ్‌రెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, గూడూరు ఎంఎల్‌ఎ వరప్రసాద్‌ పేర్లు ఉన్నట్లు సమాచారం. ఇంటింటికి ప్రభుత్వం కార్యక్రమంతోపాటు, ప్రజల్లో వ్యతిరేకత ఉన్నట్లు ఆపార్టీ నేతలు చెబుతున్నారు. ముగ్గురు సిట్టింగ్‌లు గెలిచే అవకాశం లేనట్లు నివేదికలో చెప్పినట్లు తెలుస్తోంది. నెల్లూరు, కావలి ఎంఎల్‌ఎలను ఆలోచన చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. గూడూరు ఎంఎల్‌ఎ వరప్రసాద్‌ స్థానంలో కొత్త వ్యక్తిని తీసుకు రావాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. టికెట్‌ రాని వారు ఆధైర్యపడొద్దని మరో అవకాశం ఇస్తామని ఆపార్టీ చెబుతోంది.ఉదయగిరి ఇన్‌ఛార్జ్‌గా మేకపాటి రాజారెడ్డిని, వెంకటగిరి ఇన్‌ఛార్జ్‌ నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి నియమించిన విషయం తెలిసిందే. ఇద్దరి ఇన్‌ఛార్జ్‌ల పనితీరు పట్ల అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. వీరిద్దరికి ఇక్కడ పక్కన పెడుతారనే ప్రచారం సాగుతోంది. వైసిపిలో గందరగోళ పరిస్దితులు నెలకొన్నాయి. పార్టీలో ఉన్న విభేదాలు, అభ్యర్థుల ఎంపిక విషయాలపై ఆపార్టీ దృష్టి పెట్టింది. వైసిపిలో ముగ్గురు సిట్టింగ్‌లు, ఇద్దరు ఇన్‌ఛార్జ్‌లకు టికెట్‌ అవకాశం లేదని చెబుతున్నారు. ముఖ్యమంత్రి అనిల్‌, రామ్‌కుమార్‌రెడ్డి విషయంలో సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. ఏం జరుగుతుందో చూడాలి.