Jan 18,2023 22:08

దగదర్తి వద్ద విమానాశ్రయానికి శంకుస్థాపన చేసిన ఫైలాన్‌

ప్రజాశక్తి-నెల్లూరు ప్రతినిధి :రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైసిపి జిల్లాను పారిశ్రామిక, అభివృద్ధి పరంగా దెబ్బతీయడానికి సన్నాహాలు సాగుతున్నాయి. వైసిపి అధిష్టానం దీనికి కుట్ర పన్నుతున్నారని, ఇది మంచిది కాదని వైసిపిలోని కొందరి నేతలు ఆగ్రహం వక్తం చేస్తుండగా, కొందరు నేతలు అధిష్టానానికి తాళం వేస్తున్నారు. ఇప్పటికే కృష్ణపట్నం పోర్టు ప్రయివేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లింది. కృష్ణపట్నం ధర్మల్‌ ఫవర్‌ స్టేషన్‌ను న్రయివేటీకరించడానికి సన్నాహాలు చేస్తున్నారు. కోవూరు సుగర్‌ ఫ్యాక్టరీ పని అయిపోయింది. జిల్లాల ఏర్పాటుల్లో శ్రీహరికోట షార్‌, మేనకూరు సెజ్‌, శ్రీసిటి, వెంకటగిరి చేనేత, ఇలా అనేకం దూరమయ్యాయి. ఇప్పుడు దగదర్తి వద్ద ఏర్పాటు చేయడానికి సిద్ధమైన వేళ, దానిని రామాయపట్నం వద్దకు తరలించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. కృష్ణపట్నం పోర్టుకు దగ్గరైన దీనిని కేవలం రూ.100 కోట్లు ఖర్చుపెట్టి రన్‌వే, ఆఫీసులు ఏర్పాటు చేస్తే గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టు అవుతోంది. అలాంటింది రూ.2 వేల కోట్లు పెట్టుబడులు పెట్టగలరా? అని వైసిపి నేతలే ప్రశ్నిస్తున్నారు. ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయం వైసిపిని ఇరుకున పెడుతోంది. అభివృద్ధికి సహకరించాల్సింది పోయి ఉన్నవాటిని ప్రయివేటు వ్యక్తులకు కట్టబెట్డడం, ఇతర ప్రాంతాలకు తరలించడం జరుగుతోంది. విశాఖపట్నం తరువాత అంత వేగంగా అభివృద్ధి చెందుతుంది నెల్లూరు నగరం, నెల్లూరు జిల్లా. ఇప్పుడు ఆ పరిస్థితులు కనిపించడం లేదు. నెల్లూరు జిల్లా అంటే ఆసియాలోనే అతిపెద్ద కృష్ణపట్నం పోర్టు, దేశంలోనే సాంకేతిక కేంద్రం శ్రీహరికోట షార్‌, దేశంలోనే అతిపెద్ద సెజ్‌ శ్రీసిటి, 5,600 ఎకరాలతో మేనకూరు సెజ్‌, ఆసియాలోనే అతిపెద్ద పక్షుల విడిది కేంద్రం నేలపట్టు. ఇప్పుడు ఆ పరిస్థితి జిల్లాలో కనిపించడం లేదు. జిల్లాల విభజన తరువాత షార్‌, శ్రీసిటి, మేనకూరు సెజ్‌, నేలపట్టు, వెంకటగిరి చేనేత పరిశ్రమ, అంతా తిరుపతి జిల్లాకు వెళ్లింది. ఇక మిగిలింది కృష్ణపట్నం పోర్టు. 2006 తరువాత దీనిని వేగవంతం చేసి, ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యంతో అభివృద్ధి చేశారు. ఆప్పుడు ఆ పరిశ్రమలను ఆదానీ కంపెనీకి కట్టబెట్టారు. ఇవి కాకుండా ధర్మల్‌ ప్రాజెక్టులు దానిని అన్ని మూతపడ్డాయి. ప్రభుత్వ ఆధీనంతో ఎపి జెన్‌కో 24 వేల మెగావాల్ట్‌తో నేలటూరు వద్ద నిర్మించిన ధర్మల్‌ ప్రాజెక్టును ప్రయివేటు వ్యక్తులకు కట్టబెట్టడానికి ప్రభుత్వం చకచక ఏర్పాట్లు చేస్తుంది. కోవూరు చక్కెర పరిశ్రమ దాదాపు శిథిలావస్థకు చేరుకుంది. మనకంటూ చెప్పుకోడానికి జిల్లాలో ఏ ఒక్క పెద్ద ప్రాజెక్టు కనిపించడం లేదు. 'అమ్మకు అన్నం పెట్టలేని వాడు పిన్నమ్మకు పట్టుచీర పెట్టినట్లు '' 42 బెర్త్‌లతో ఆసియాలోనే అతిపెద్ద పోర్టు కృష్ణపట్నంను ఆదానీ కంపెనీకి అప్పగించి, ఇప్పుడు రామాయపట్నంను అభివృద్ధి చేస్తానంటూ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి గొప్పలు చెబుతున్నారు. అందుకోసం భూమి పూజ చేశారు. దానిని వైసిపిలోని పెద్దలకు కట్టబెట్టారు. ఇది పూర్తి చేస్తారా ? లేదా అనుమానమే. జిల్లా అభివృద్ధి విషయంలో ఒక్క ప్రజా ప్రతినిధి సిఎంతో మాట్లాడే సాహసం చేయడం లేదు. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటే దానికి తలలు ఊపుతున్నారు. పరిస్థితి ఇలానే ఉంటే నెల్లూరు జిల్లా చరిత్ర కాలగర్భంలో కలిసిపోతుంది.
విమానాశ్రయం ఎందుకు మార్చాలి..?
రాష్ట్రంలోనే వేగంగా అబివృద్ధి సాధించిన నెల్లూరు జిల్లాను మరింత అబివృద్ధి చేయడానికి 2006లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జిల్లాకు విమానాశ్రయం మంజూరు చేశారు. ఎంతో అభివృద్ధి సాధించి, దేశంలోని వివిధ ప్రాంతాలు, ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు పెద్దఎత్తున ప్రయాణికులు ఇక్కడ నుంచి వెళుతున్న విషయం గుర్తించారు. విమనాశ్రయం కోసం 190 కిలో మీటర్లు తిరుపతి, 180 కిలో మీటర్లు చెన్నరు, 250 కిలోమీటర్లు విజయవాడ వెళ్లాల్సి వచ్చేది. కృష్ణపట్నం పోర్టుకు వచ్చే వ్యాపారవేత్తలు, ఇతర సరుకుల రవాణా కోసం తొలుత నెల్లూరు నగరంలో విమానాశ్రయం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అమంచర్ల వద్ద నిర్మాణం కోసం తొలుత భూసేకరణ మొదలు పెట్టారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి అన్ని నెల్లూరు ఎందుకు కొంత దూరంలో పెడితే ఇతర ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి కదా అని దానిని దగదర్తి వద్దకు మార్పు చేశారు. గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌ పోర్టు నిర్మాణం కోసం 1350 ఎకరాల భూమిని సేకరించారు. అందుకోసం రూ.350 కోట్లు భూ సేకరణకు ఖర్చు చేశారు. 2014లో ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు రాగానే మిగిలిన మొత్తం చెల్లించారు. 2019 జనవరి6 అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌.చంద్రబాబునాయుడు ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం రూ.100 కోట్లు ఖర్చుచేస్తే రన్‌వే, ఆఫీసు నిర్మాణం చేస్తే సరిపోతుంది. ఇప్పుడు దీనిని రామాయపట్నం వద్దకు మార్పుచేయడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. భూసేకరణ, ఇతర ఖర్చుల కోసం రూ.2 వేల కోట్లు ఖర్చు అవుతుందని తెలుస్తోంది. ఇదే విషయంపై వైసిపి నేతల మధ్య రగడ సాగుతోంది. వెంకటగిరి ఎంఎల్‌ఎ ఆనం రామనారాయణరెడ్డి అధికారులు, ఆపార్టీ నేతలతో గొడవకు దిగినట్లు సమాచారం. కావలి ఎంఎల్‌ఎ రాంరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి దీనికి సపోర్టు చేయడం, ఇతర ఎంఎల్‌ఎలు ఎవరూ ముఖ్యమంత్రికి చెప్పకపోవడం పార్టీకి నష్టం జరుగుతుందని వైసిపి నేతలు కొందరంటున్నారు.