'సీమ'ను అభివృద్ధి చేసి చూపిస్తాంప్రజాశక్తి-బద్వేల్
రాయలసీమ వాసులు జగన్‌కు 49 మంది ఎమ్మెల్యేలను గెలిపించి ఇస్తే వారు సీమకు చేసిందేమిటని, రాబోవు ఎన్నికల్లో వైసిపికి ఇచ్చిన సీట్లు తమకు ఇస్తే రాయ లసీమను అభివృద్ధి చేసి చూపిస్తామని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. జగన్ పాలనలో రైతులు నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులతో ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. వాటి ధరలూ విఫరీరంగా పెరిగిపోయాయని తెలిపా రు. యువగళం పేరుతో లోకేష్ చేపట్టిన పాదయాత్ర 123 రోజుకు చేరుకుంది. ఆదివారం కడప జిల్లా బద్వేలు నియో జకవర్గంలోని నదియాబాద్ విడిది కేంద్రం నుంచి ప్రారంభమైన పాదయాత్ర సోమే శ్వరపురం, ఎర్రబల్లె, అప్పరాజుపేట, రాజుపాలెం, వెంకటశెట్టిపల్లి, కొంగలవీడు, శివరాంనగర్, శంకరాపురం క్రాస్, చింతలచెరువు క్రాస్, బయ్యనపల్లి, అబ్బూ సాహెబ్, బద్వేలు శివారు విద్యానగర్ విడిది కేంద్రం వరకూ సాగింది. ఆయా ప్రాంతాల్లో రైతులు, స్థానికులు, విద్యార్థులతో ముఖాముఖి, సమావేశాలు, మాటామంతీ వంటి కార్యక్ర మాలు నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో లోకేష్ మాట్లాడుతూ సీమ రైతులకు నీరిస్తే బంగారం పండిస్తారని చెప్పారు. నాలుగేళ్ల వైసిపి పాలనలో డ్రిప్‌పై సబ్సిడీని ఎత్తేసి రైతులకు తీవ్ర అన్యాయం చేశారన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పాత డ్రిప్ ఇరిగేషన్ విధానాన్ని తీసుకొస్తామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో రాయలసీమ ప్రాజెక్టుల కోసం రూ. 11,700 కోట్లు ఖర్చు చేశారని, అందులో వైసిపి ప్రభుత్వం పది శాతం కూడా వ్యయం చేయలేదని వాపోయారు. అధికారంలోకి వచ్చిన వెంటను భవిష్యత్‌కు గ్యారెంటీ పేరుతో అన్నదాతకు రూ.20 వేల ఆర్థిక సాయం చేస్తామని పేర్కొన్నారు. ఒకే సంతకంతో రూ.50 వేల లోపు ఉన్న రుణాలన్నీ మాఫీ చేసి చంద్రబాబునాయుడే అన్నారు. టిడిపి హయంలోనే పులివెందులకు నీళ్లు ఇచ్చారన్నారు. జగన్ పాలనలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వాపోయారు. రైతుల ఆత్మహత్యల్లో ఎపి దేశంలోనే నంబర్ 3 స్థానంలో, కౌలు రైతుల ఆత్మహత్యల్లో నంబర్ 2గా ఉందని చెప్పారు. పంట నష్టం వాటిల్లితే కనీసం పంట నష్టం అంచనా వేసే దిక్కు జగన్ ప్రభుత్వంలో లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గోదావరి, కృష్ణా, పెన్నా అనుసంధానం ద్వారానే సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కరం లభిస్తుందని అభిప్రాయపడ్డారు. లోయర్ సగిలేరు ప్రాజెక్టును ఆధునీకరిస్తామని బద్వేల్ ఉప ఎన్నికల సందర్భంగా జగన్ హామీ ఇచ్చి మోసం చేశారని పేర్కొన్నారు. ముంపుకు గురై భూములు కోల్పోయిన రైతులను ఆదు కుంటామన్నారు. బద్వేల్‌లో టిడిపి జెండా ఎగురవేస్తే పెండింగ్ ప్రాజెక్టులు, బ్రిడ్జి పనులు పూర్తి చేసే బాధ్యత తనదని తెలిపారు. జగన్ సొంత బ్రాండ్లు అమ్ముకోవడానికి చెరకు రైతులను వేధిస్తున్నాడని, బెల్లం అమ్ము కోవడానికి వీలులేకుండా అక్రమ కేసులు పెడు తున్నారని విమర్శించారు. బద్వేల్ నియో జకవర్గంలో సాగునీటి కష్టాలు తీర్చడానికి పిల్లకాలువ తవ్వుతామన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు రాయలసీమలో హార్టి కల్చర్‌ని ఎక్కువుగా ప్రోత్సహిస్తామని చెప్పారు. వాతావరణ పరిస్థితులకు అనుగు ణంగా ప్రత్యేక జోన్లు ఏర్పాటు చేస్తాం. మామిడి, దానిమ్మ, బొప్పాయి, చీనీ, కర్జూరం ఇలా వీటిలో అనేక రకాల మొక్కలు ఇక్కడే పెంచే విధంగా రీసెర్చ్ సెంటర్లు ఏర్పాటు చేస్తా మని, వ్యవసాయ అనుబంధ రంగాలను కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తామని తెలిపారు. జూస్ ఫ్యాక్టరీలు రావడానికి కావాల్సిన రకాలు పెంచే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. పాడి పరిశ్రమ, గొర్రెల పెంపకం, సెరీ కల్చర్ ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తామని తెలిపారు. సోమశిల ముంపు బాధితులకు టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే న్యాయం చేస్తామని, మొదటి 18 నెలల్లో పరిహారం అందిస్తామని తెలిపారు. బద్వేల్ నియోజకవర్గంలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తే అదనంగా మరో 80 వేల ఎకరాలు సాగులోకి వచ్చే అవకాశం ఉందని, టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కుందూ ప్రాజెక్టు పూర్తి చేసి సాగునీరందిస్తామని తెలిపారు. వైసిపి ఇసుకాసురుల దెబ్బకు పెన్నానది విలవిలలాడుతోందన్నారు. పత్రికలు ఘోషిస్తున్నా, ప్రజలు మొరపెట్టుకుంటున్నా వైసిపి ఆగడాలు ఆగడం లేదదన్నారు. ఇది బద్వేలు నియోజకవర్గంలోని లింగాలకుంట వద్ద పెన్నానది ఇసుక కోసం వెళ్తున్న టిప్పర్ లారీ అని, ఇసుక లోడ్ చేసుకున్నాక ఎక్కడికి తీసుకెళ్తారని అడిగితే బెంగుళూరు వెళ్తామని డ్రైవర్ సమాధానమిచ్చారని చెప్పారు. ఇక్కడ ఇసుక కూతవేటు దూరంలోని గ్రామప్రజలకు దొరకదు కానీ, చెన్నరు, బెంగుళూరులో మాత్రం విరివిగా దొరుకుతుందని వాపోయారు. ముఖ్యమంత్రి సొంత ప్రాంత ప్రజలకు గుక్కెడు నీళ్లు ఇవ్వలేని దుస్థితిలో లేరని చెప్పారు. టిడిపి అధికారంలోకి రాగానే వాటర్ గ్రిడ్ ద్వారా ప్రతిఇంటికీ కుళాయి ఇచ్చి, సురక్షితమైన తాగునీరు అందిస్తామన్నారు. చెరువుల నుంచి రైతులు పొలాలకు ఉచితంగా మట్టితోలుకునే హక్కు కల్పిస్తామని చెప్పారు. తీరప్రాంత ప్రజలు ఉచితంగా పెన్నానది నుంచి ఇసుక తెచ్చుకునే అవకాశం కల్పిస్తామని పేర్కొన్నారు. వైసిపి పాలనంలో రాష్ట్రంలోని ప్రజల ఆస్తులు, మాన, ప్రాణాలకురక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వైసిపి గూండాల పెట్రేగిపోతుండటంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారన్నారు. వైసిపి రౌడీ మూకలను ఉక్కుపాదంతో అణిచివేస్తామన్నారు. టిడిపి అధికారంలోకి రాగానే సిపి రోడ్డు నుంచి కొత్తచెరువు, జో గిరెడ్డిగారిపల్లె, తిప్పనపల్లె వెళ్లే రోడ్డు పనులను పూర్తి చేస్తామన్నారు. బ్రహ్మంసాగర్ కుడికాల్వ పనులను పూర్తి చేసి సాగునీటి కష్టాలు తీరుస్తామన్నారు.మీ కోసం పనిచేసే చంద్రన్నను సిఎం చేసేందుకు మీవంతు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.










