వైసిపి సర్కారుపై టిడిపి నేతల ధ్వజం
ప్రజాశక్తి-అల్లూరు : రైతులకు జరుగుతున్న అన్యాయంపై వైసిపి సర్కారుపై టిడిపి నాయకులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ పార్టీ నాయకులు సోమవారం మండలంలోని గ్రద్దగుంట, బట్రకాగోల్లు తదితర గ్రామాలలో ఇటీవల కురిసిన అకాల వర్షానికి తీవ్రంగా నష్టపోయిన రైతులను అలాగే పంట పొలాలను పరిశీలించారు. తదుపరి తహశీల్దార్ శ్రీరామకృష్ణను కలసి ధాన్యాన్ని విక్రయించే క్రమంలో రైతులు పడుతున్న దగాను వివరించి తక్షణమే వారిని ఆదుకోవాలని తెలియజేశారు. ఈ సందర్భంగా టిడిపి సీనియర్ నాయకులు నెల్లూరు నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ అకాల వర్షంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని విచారం వ్యక్తం చేశారు. మార్చిలో ఎన్నడూ లేని విధంగా వర్షాలు కురవడంపై చింతించారు. రైతులు పండించిన ధాన్యాన్ని 19 వేలకు కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో అర్ధాంతరంగా రూ.16వేలకు కొనుగోలు చేస్తూ రైతుల నడ్డి విరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వంలో రైతులు ఏనాడు సుఖ సంతోషాలతో లేరన్నారు. మాజీ జెడ్‌పిటిసి, సీనియర్ నాయకులు బీద గిరిధర్ మాట్లాడుతూ రెక్కలు ముక్కలు చేసుకుని రైతులు ఆరుగాలం పండించిన ధాన్యానికి సరైన ధర లేకపోవడంపై అన్నదాతలు తల్లడిల్లుతున్నారని ఆవేదన వ్యక్తపరిచారు. 17,18 తేదీల్లో కురిసిన అకాల వర్షంతో రైతులు తీవ్రంగా నష్టపోగా పండించిన ధాన్యాన్ని అమ్ముకోవాలంటే అనేక ఇక్కట్లు చెందుతున్నారని విచారం వ్యక్తపరిచారు. జరిగిన అన్యాయాన్ని చెప్పుకునేందుకు రైతులు వ్యవసాయ కార్యాలయానికి రాగా తాళాలు వేయడం సిగ్గుచేటన్నారు. అర్జీని తాళం వేసిన కార్యాలయం వద్ద ఉంచామన్నారు. స్పందన రోజైనా అధికారులు అందుబాటులో లేకపోవడం చాలా దారుణమన్నారు. ఎంఎస్‌పి ప్రకారం పండించిన ధాన్యాన్ని రూ.17వేలకు కొనాలని కాగా కావలి ఎంఎల్‌ఎ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి జెసితో విచ్చేసి వెళ్లడం తప్ప నష్టపోయిన రైతుల కోసం కనీసం అధికారులతో రివ్యూ మీటింగ్ ఏమన్నా పెట్టారా అంటూ ప్రశ్నించారు. ఈ మండలంలో వైసిపి నేతలకు చిత్తశుద్ధి ఉంటే రైతుల కోసం ఎన్ని ప్యాడి పొక్రిమెంట్లు ఓపెన్ చేశారో అలాగే ఎంతమంది రైతులు ఆయా రైతు భరోసా కేంద్రాలలో రిజిస్టర్ అయ్యారో తెలియజేయాలన్నారు. మండలంలో నష్ట పోయిన రైతుల కోసం ఎన్ని గన్ని బ్యాగులు ఉన్నాయో ఆ బ్యాగులు ఏ రైతులకు ఇచ్చారో తెలపాలని డిమాండ్ చేశారు. రైతులను ఆదుకునేందుకు ఎన్ని రైస్ మిల్లులు ఏర్పాటు చేశారో తెలపాలన్నారు. బ్యాంకు గ్యారంటీ (బిజి) ప్రకారం అధికార యంత్రాంగాన్ని పూర్తి సమాచారం ఇవ్వాలని కోరారు. రైతులకు అన్యాయం జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు అరగల రమణయ్య, రామిశెట్టి కృష్ణచైతన్య, విడవలూరు దశరథ రామిరెడ్డి, షేక్ నజీర్ బాషా తదితరులున్నారు.










