ఓబుళదేవరచెరువు : ప్రజలను విస్మరించి పాలన సాగిస్తున్న వైసిపి ప్రభుత్వానికి పతనం ఖాయం అని టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. లోకేష్ ఆధ్వర్యంలో చేపట్టిన యువగళం పాదయాత్ర ఉగాది మూడు రోజుల విరామం తర్వాత శనివారం నాడు మొదలైంది. 50వ రోజు ఓబుళదేవరచెరువు మండలంలో యాత్ర కొనసాగింది. శనివారం ఉదయం వణుకువారిపల్లి నుంచి యాత్ర ప్రారంభం అయ్యింది. అక్కడి నుంచి గాజుకుంట్లపల్లి, వైఎస్సార్ సర్కిల్, ఓబుళదేవచెరువు మీదుగా వేమారెడ్డిపల్లి గ్రామం వరకు పాదయాత్ర కొనసాగింది. సాయంత్రం వేమారెడ్డిపల్లి గ్రామంలో బహిరంగ సభ నిర్వహించారు. గాజుకుంట్లపల్లి వద్ద వేరుశనగ పంటను పరిశీలించారు. పంట చేతికందక తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆయన దృష్టికి తెచ్చారు. ఓబుళదేవచెరువులో ముస్లిం మైనార్టీలతో ముఖాముఖి నిర్వహించారు. అక్కడి నుంచి సున్నంపల్లి క్రాస్ విడిది కేంద్రం వరకు పాదయాత్ర చేపట్టారు. ఆయా ప్రాంతాల్లో లోకేష్‌కు టిడిపి శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. ఆయా ప్రాంతాల్లో రైతులు, ప్రజలు వారి సమస్యలను వినతిపత్రాల ద్వారా లోకేష్ దృష్టికి తీసకెళ్లార. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో వైసిపికి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పాలనపై జనం విసిగిపోయారన్నారు. 2024లో జరిగే ఎన్నికల్లో జగన్ ఇంటికి వెళ్లక తప్పదని జోస్యం చెప్పారు. ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసిపి అభ్యర్థులను పట్టభద్ర ఓటర్లు ఛీకొట్టారని తెలిపారు. ఇక ఎమ్మెల్యేల కోటాలో 23 ఓట్లతో టిడిపి వైసిపిని ఓడించడం దేవుని స్క్రిప్ట్ అని పునరుద్ఘంటించారు. బలం లేకున్నా 7 ఎమ్మెల్సీ స్థానాలను గెలవాలన్న అత్యాసతో ముఖ్యమంత్రి భంగపడ్డారని ఎద్దేవా చేశారు. గెలవలేని స్థానంలో ఒక బిసి అభ్యర్థిని పోటీలో నిలబెట్టి ఆయన్ను బలిపశువును చేశారన్నారు. బిసిల నమ్మకద్రోహి జగన్మోహన్‌రెడ్డి అన్నారు. యువగళం పాదయాత్రకు వస్తున్న జనాన్ని చూసి వైసిపి నేతల్లో వణుకు మొదలైందన్నారు. టిడిపి అధికారంలోకి రాగానే రాష్ట్రంలో అన్ని వర్గాల వారి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి, శ్రీసత్యసాయి జిల్లా అధ్యక్షులు బికె.పార్థసారథి, టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, టిడిపి మండల కన్వీనర్ జయచంద్ర, మాజీ జెడ్పీటీసీ పిట్టా ఓబుల్ రెడ్డి, టీడీపీ నాయకులు బోయపల్లి శివారెడ్డి, నిజాం, మల్లాపల్లి ఓబుల్ రెడ్డి, డాక్టర్ పొగాకు జాకీర్, ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు, వెంకటరంగారెడ్డి, కంచి సురేష్, గంటా శ్రీనివాసులు, చికెన్ షాను, అంజినప్ప, ఆరీఫ్‌ఖాన్, షబ్బీర్, అంజన రెడ్డి, నారపరెడ్డి, కుమార్ రాయల్, సౌదీ నాగరాజు, సుధాకర్, ఎద్దుల కరుణాకర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, సుబ్రమణ్యం స్వామి, అబ్ల్యూ హుస్సేన్, వైదేహి, మస్తానమ్మ పాల్గొన్నారు.
యువగళంలో నారా రోహిత్
లోకేష్ యువగళం పాదయాత్రలో ఆయన సోదరుడు, సినీహీరో నారా రోహిత్ పాల్గొన్నారు. లోకేష్‌తో కలిసి నడిచారు. ప్రజలకు అభివాదం చేస్తూ ఉత్తేజిత పరుస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా టిడిపి శ్రేణులు నారా రోహిత్‌తో సెల్ఫీలు దిగారు.










