పీలేరు వైసిపి ప్రభుత్వం రాష్ట్రంలోని బిసిలకు తీరని అన్యాయం చేస్తూందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలిపారు. యువగళం పేరుతో లోకేష్ చేపట్టిన పాదయాత్ర 36వ రోజుకు చేరుకుంది. సోమవారం వేపులబయలు నుంచి ప్రారంభమైన పాదయాత్ర అంకాళమ్మతల్లి దేవాలయం, శివాపురం, తిమ్మిరెడ్డిగారిపల్లి, కొర్లకుంట పట్టికాడ నుంచి కలికిరి మండలంలోని సత్యపురంలోకి ప్రవేశించింది. నగిరిపల్లి క్రాస్, కలికిరి ఇందిరమ్మ కాలనీ వరకూ పాదయాత్ర సాగింది. మండలంలోని వేపుల బైలు గ్రామ సమీపంలో కిషోర్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి మేరకు బిసి రాష్ట్ర కార్యదర్శి పురం రామ్మూర్తి, వసంతల రాజా అధ్యక్షతన యువ నేత నారా లోకేష్ బిసిలతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ ప్రభుత్వంలో బిసిలకు జగన్మోహన్‌రెడ్డి అన్యాయం చేశారన్నారు. బిసి కార్పొరేషన్ నిధులు పక్కదారి పట్టించి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కరువు చేశారని మండిపడ్డారు. కార్పొరేషన్ కార్యాలయంలో చైర్మన్ కూర్చోడానికి కనీసం కుర్చీ కూడా లేదని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ హయాంలో బిసిలకు కేబినెట్ హోదా కల్పిస్తూ సముచిత స్థానం కల్పించామని గుర్తు చేశారు. తాము తిరిగి అధికారంలోకి వచ్చాక బిసిలకు కచ్చితంగా న్యాయం చేసే బాధ్యత తాను తీసుకొంటానని లోకేష్ బిసి సోదరులకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పలువురు బిసి సంఘాల నాయకులు, ప్రజలు అడిగిన ప్రశ్నలకు లోకేష్ సంతప్తికర సమాధానాలు ఇచ్చారు. పాదయాత్ర ప్రారంభానికి ముందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లోకేష్ మాట్లాడుతూ టిడిపి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అనేక పరిశ్రమలు వచ్చాయన్నారు. గడచిన నాలుగేళ్లలో వైసిపి ప్రభుత్వం నిద్రమత్తులో జోగుతోందన్నారు. వైసిపి పాలనలో పెద్దఎత్తున పిపిఎలు రద్దు చేసి అనేక పరిశ్రమలను ఎపి నుంచి తరిమేశారని విమర్శించారు. జగన్ సిఎం అయ్యాక ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, లూలూ, హోలీటెక్, అమర్ రాజా, మెగాసీడ్ పార్క్, జాకీ, ఏషియన్ పేపర్ పల్ప్ కంపెనీలు పారిపోయాయన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య మూడు రెట్లు పెరిగి 13.5 శాతానికి పెరిగిందని చెప్పారు. గంజాయి సరఫరాలో మాత్రం ఎపి మొదటి స్థానంలో ఉందని తెలిపారు. కడప స్టీల్ ఫ్యాక్టరీకి ఇప్పటికే జగన్ పలుమార్లు శంకుస్థాపనలు చేశారనీ, పనులు ప్రారంభం కాలేదనీ, ఉపాధి అవకాశాలు ఎలా వస్తాయని మరో ప్రశ్నకు సమాధానం చెప్పారు. సరస్వతీ సిమెంట్స్ పేరుతో ప్రభుత్వం భూములు తీసుకుందనీ, నేటికీ పరిశ్రమ రాలేదన్నారు. 175 సీట్లు వస్తాయంటే జగన్ పరదాలు కట్టుకుని ఎందుకు దాక్కుని తిరుగుతున్నాడని, తాడేపల్లి ప్యాలెస్‌లో కూర్చుని బటన్ నొక్కడం ఎందుకు? జిఒ-1 ఎందుకు తెచ్చారని ప్రశ్నించారు. టిడిపి, జనసేన కలిసి పోటీచేస్తాయని మేం ఎక్కడైనా చెప్పామా? వాళ్లు మేం ఎక్కడ పోటీ చేయాలో నిర్ణయిస్తే మేం పోటీ చేయాలా? ఎన్నికల సమయంలో అప్పటి పరిస్థితులకు అనుగుణంగా మా రాజకీయ వ్యూహాన్ని అమలు చేస్తామని మరో ప్రశ్నకు సమాధానమిచ్చారు. కార్యక్రమంలో మాజీ మంత్రి ఎన్.అమర్నాథ్‌రెడ్డి, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్‌రెడ్డి, పుంగనూరు నియోజకవర్గ బాధ్యులు చల్లా రామచంద్రారెడ్డి, ధూళిపాళ్ల నరేంద్ర, ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి, బిసి నాయకులు పురం రామ్మూర్తి, వసంతాల రాజా, స్పోర్ట్స్ మల్లి ఇతర నాయకులు పాల్గొన్నారు.










