పొన్నూరు (గుంటూరు) : వైసిపి నేతలు తమ పద్ధతి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు హెచ్చరించారు. సంగం డెయిరీ కేసు వ్యవహారంలో టిడిపి మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అరెస్టయి జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. జైలుకు వెళ్లి వచ్చిన నరేంద్రను చంద్రబాబు మంగళవారం గుంటూరు జిల్లా చింతలపూడిలోని ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. తమ పార్టీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని, చట్టాన్ని ఉల్లంఘించి పనిచేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. వైసిపి అవినీతి నుంచి దృష్టి మరల్చేందుకే తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. పోలీసు యంత్రాంగం కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తోందని, ఇది మంచి పద్ధతి కాదని అన్నారు. చట్ట వ్యతిరేకంగా ప్రజలను, టిడిపి నేతలను ఎలా హింసిస్తున్నారో వాటన్నింటినీ గుర్తు పెట్టుకుంటామని తెలిపారు. తమ ప్రభుత్వ హయాంలో రాజయలసీమలో ముఠాకక్షలపై కఠినంగా వ్యవహరించి ప్రశాంతత తీసుకొచ్చామని, వైసిపి నాయకులు అక్కడ ఇప్పుడు మళ్లీ హత్యారాజకీయాలు ప్రారంభిస్తున్నారని, ఇది సరైంది కాదని అన్నారు. నరేంద్రకు టిడిపి అండగా ఉంటుందని, ప్రజలు కూడా అండగా నిలబడాలని పేర్కొన్నారు.










